Gujarat Covid Patient Discharged After
202 Days of Hospitalisation
కొవిడ్‌తో 202 రోజుల సుదీర్ఘకాలం పోరాడి డిశ్ఛార్జి అయిన గుజరాత్ మహిళ
గీతా ధార్మిక్ (45) గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన మహిళ ఏకంగా 202 రోజుల
పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాక ఆమె డిశ్ఛార్జి అయ్యారు. గీత భర్త త్రిలోక్
ధార్మిక్ దాహోద్‌లో రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. భోపాల్‌లో ఉన్న వారి
సమీప బంధువొకరు గుండెపోటుతో చనిపోవడంతో ఏప్రిల్ 23న
దంపతులిద్దరూ అక్కడికి వెళ్లారు. తిరిగి 25వ తేదీన దాహోద్
చేరుకోగానే గీతలో లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా
తేలింది.
ఆమె ఆక్సిజన్ స్థాయి కూడా
పడిపోవడంతో మే 1న స్థానిక రైల్వే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి
క్రమేపీ విషమించడంతో 7వ తేదీన వడోదరాలోని ఓ ప్రైవేటు
ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచనలతో తిరిగి 24వ తేదీన
దాహోద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వెంటిలేటర్‌పైన, శ్వాస
సంబంధిత పరికరాలపైన ఆమె దాదాపు 3 నెలలు చికిత్స పొందారు.
ఎట్టకేలకు ఆమె కోలుకున్నట్లు
త్రిలోక్ శనివారం తెలిపారు. ‘‘ఒక దశలో అన్ని ఆశలూ వదులుకున్నాం. కనీసం 9
సార్లు ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఊపిరితిత్తుల మార్పిడి కూడా
చేయాల్సి రావచ్చని వైద్యులు చెప్పారు. అయితే క్రమేపీ ఆమె ఆరోగ్యం మెరుగుపడుతూ
వచ్చింది. ఇప్పటికీ ఆమెకు కొంత ఆక్సిజన్ అవసరమవుతోంది. ఇది మినహా మరెలాంటి ఆరోగ్య
సమస్యలూ లేవు’’ అని త్రిలోక్ తెలిపారు.
0 Komentar