Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How To Teach Your Kids Good Money Habits

 

How To Teach Your Kids Good Money Habits

మీ పిల్లలకు పొదుపు, బడ్జెట్, ఖర్చులు, సంపద మరియు ఇతర ఆర్థిక అంశాల గురించి అవగాహన కల్పించండి – సూచనలు ఇవే   

జీవితానికి అవసరమైన చిన్న చిన్న విషయాలను తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటుంటారు. మరికొన్ని నైపుణ్యాలను ఉపాధ్యాయుల నుంచి గానీ స్నేహితుల నుంచి గానీ నేర్చుకుంటారు. భవిష్యత్‌కు కావాల్సిన కొన్ని పాఠాలకు ఆచరణాత్మక జ్ఞానం (ప్రాక్టికల్ నాలెడ్జ్) అవసరం. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనూ ఇది ఎంతో ముఖ్యం. అయితే పాఠశాలలో గురువులు ఆర్థిక నిర్వహణ గురించి భోదించగలరు గానీ ఆచరణాత్మక స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. అందువల్ల ఆర్థిక విషయాలు, అంటే ఆర్థిక నిర్వహణను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రులు డబ్బు నిర్వహణ గురించిన అంశాలను పిల్లలతో చర్చించాలి. 

ఎందుకు చర్చించాలి?

పిల్లల భవిష్యత్‌ కోసమే తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. కష్టపడి ఆస్తిని కూడబెడుతుంటారు. ఇలా సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అయినా పిల్లలకు బదిలీ చేయాలి. చిన్న వయసులోనే వాటిని ఎలా నిర్వహించాలో నేర్పించడం వల్ల భవిష్యత్‌లో నష్టపోకుండా ఉంటారు. తల్లిదండ్రులు వారి ఆర్థిక సలహాదారుడిని పిల్లలకు పరిచయం చేయొచ్చు. అప్పుడప్పుడు వారు చెప్పే మాటల ద్వారా పిల్లలు డబ్బు విలువను మరింత లోతుగా తెలుసుకుంటారు. డబ్బు గురించి పిల్లలతో తరచూ మాట్లాడటం వల్ల వారికి భయం తగ్గుతుంది. డబ్బు నిర్వహణలో మరింత సమర్థంగా వ్యవహరిస్తారు. ఇది ఆర్థిక భద్రత దూసుకుపోయేలా పిల్లలను తయారుచేస్తుంది. చిన్న వయసులోనే డబ్బు నిర్వహణ నేర్చుకోవడం వల్ల యుక్త వయసులో పొదుపు, ఖర్చులు, సంపద, అప్పులను సమర్థంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 

ఎలాంటి విషయాలను చర్చించాలి?

పొదుపు, బడ్జెట్, ఇతర ఆర్థిక అంశాల గురించి పిల్లలతో మాట్లాడటం అనేది ఆర్థిక నిర్వహణ గురించి తెలుసుకునేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా చిన్న మొత్తంలో డబ్బుని పిల్లలకు ఇచ్చి వారి నెలవారీ అవసరాలకు ఉపయోగించుకుని మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసే విధంగా ట్రైనింగ్ ఇస్తే ఆర్థిక విషయాల్లో సూక్ష్మ నైపుణ్యాలను పిల్లలు త్వరగా నేర్చుకోగలుగుతారు. చిన్న వయస్సులోనే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించడం ప్రారంభిస్తే ఆర్థిక వైఫల్యాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే, మన రోజువారీ ఆర్థిక పరమైన సంభాషణలో ముఖ్యంగా బడ్జెట్, ఖర్చుల గురించి చర్చించుకునే సమయంలో పిల్లలను చేర్చుకోవడం ప్రారంభిస్తే, వాటి గురించి మెరుగైన పద్ధతిలో నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ఈ వ్యాయామం వారి ఆర్థిక జీవన విధానంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియజేయడంలో సహాయపడుతుంది. 'అవసరం', 'కోరిక' మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే వీలు కల్పిస్తుంది. అలాగే, డబ్బు వ్యవహారాల్లో వారు మరింత జవాబుదారీగా, బాధ్యతగా ఉండేందుకు తోడ్పడుతుంది. 

ఎప్పుడు చర్చించాలి?

ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితులలో పిల్లలు ఆర్థిక, సంపద నిర్వహణ గురించి తెలుసుకోవడం అవసరం. పరిస్థితిని మెరుగు పరిచేందుకు పిల్లలు ప్రస్తుతం కుటుంబంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం చాలా కీలకం. పిల్లలు చాలా త్వరగా ఈ విషయాలను నేర్చుకుంటారు. కుటుంబం మొత్తం భోజనానికి కూర్చున్న సమయంలో, అలాగే విహారయాత్రలకు బయటికి వెళ్లిన సమయంలో ఆర్థిక విషయాల గురించి చర్చించొచ్చు. 

ఇంకా ఏం చేయవచ్చు?

పై తెలిపిన వాటితో పాటు పిల్లలకు నెలకు ఇంత అని డబ్బులు ఇచ్చి వాటికి సంబంధించిన లావాదేవీలను ఒక లెక్కల పుస్తకంలో రాయమని చెప్పొచ్చు. ఖర్చులను ఎలా నియంత్రించాలి? పొదుపు ఎలా చేయాలి? అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగ పడుతుంది. అలాగే, వారి పేరు మీద ఒక మైనర్ బ్యాంకు ఖాతా తెరవొచ్చు. ఇందులో మీ పర్యవేక్షణలో బ్యాంకు లావాదేవీలను వారికి నేర్పించవచ్చు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కోటక్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి అనేక బ్యాంకులు మైనర్ ఖాతా అందిస్తున్నాయి. 

మీ పిల్లలకు డబ్బు విలువను నేర్పడానికి వారితో ఆర్థిక, సంపదను గురించి చర్చించాలి. చిన్న వయస్సులోనే ఆర్థిక అక్షరాస్యత బీజాలను నాటడం వల్ల మీ పిల్లల గురించి మీరు మరింత తెలుసుకునేందుకు వీలవడంతో పాటు, మీ సంపద మీ పిల్లల చేతికి చేరిన తర్వాత కూడా భద్రంగా ఉంటుంది. మరింత సంపద సృష్టి జరుగుతుందనే భరోసాను ఇస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags