NEET 2021 Results Declared, Three Candidates
Share Top Rank Scoring Full Marks
నీట్-2021 ఫలితాలు విడుదల - ముగ్గురికి మొదటి ర్యాంక్
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నీట్-యూజీ 2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు గురువారం లైన్ క్లియర్ చేయడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని విద్యార్థులు భావించారు. అయితే, నాలుగు రోజులైనా ఫలితాలు వెల్లడించకపోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏ అధికారులు ఫలితాలు విడుదల చేశారు. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ అందరికీ ఒకే ర్యాంకు కేటాయించారు. నీట్ ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. పరీక్ష తుది కీ, స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముగ్గురికి మొదటి ర్యాంక్.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు
నీట్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి మొదటి ర్యాంకుతో మెరిశాడు. అలాగే దిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తిక నాయర్‌లకు కూడా మొదటి ర్యాంక్ వచ్చింది. ఏపీకి చెందిన విద్యార్థి రుషీల్ (విజయవాడ), చందం విష్ణు ఇద్దరూ ఐదో ర్యాంకుతో సత్తా చాటగా.. పీవీ కౌశిక్ రెడ్డి అనే మరో విద్యార్థి 23వ ర్యాంకు సాధించాడు. కౌశిక్ రెడ్డి కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కావడం విశేషం. అలాగే, గుంటూరు జిల్లాకు చెందిన తెంటు సత్య కేశవ్ 38వ ర్యాంకులో మెరిశాడు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ఖండవల్లి శశాంక్ ఆలిండియా ఐదో ర్యాంకు సాధించగా.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన విద్యార్థిని శరణ్య 60వ ర్యాంకుతో నిలిచారు.
మరోవైపు, వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ముంబయిలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అంతవరకు ఫలితాల విడుదల నిలిపివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ వచ్చింది. అయితే, బాంబే హైకోర్టు తీర్పుపై ఎన్‌టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. కేవలం ఇద్దరి కోసం 16లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. ఆ ఇద్దరి విద్యార్థుల విషయాన్ని దీపావళి సెలవుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన నీట్ 2021 ఫలితాలను అధికారులు ఈరోజు విడుదల చేశారు.
0 Komentar