Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

These Countries Have Changed Their Names for Various Reasons

 

These Countries Have Changed Their Names for Various Reasons

పేరు మార్చుకున్న కొన్ని దేశాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

కొన్ని ప్రాంతాలకు ప్రభుత్వాలు పేర్లను మార్చుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ నగరమైన అలహాబాద్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగరాజ్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రికి గతంలో ఉన్న పేరే రాజమహేంద్రవరంగా మార్చారు. అలా పేరు మార్చుకున్న కొన్ని దేశాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే! 

1. Ceylon to Sri Lanka - శ్రీలంక

దక్షిణాసియాలో హిందూ మహాసముద్రంలో ఉండే ఒక ద్వీపం శ్రీలంక. ఈ దేశానికి గతంలో అనేక పేర్లున్నాయి. ఒకప్పుడు విజయ అనే రాజు పరిపాలించినప్పుడు ఈ ప్రాంతానికి ‘తంబపన్నీ’ అని పేరుండేది. రామాయణంలో ఈ ద్వీపాన్ని ‘లంక’గా పేర్కొన్నారు. తమిళ ప్రజలు ‘ఈలం’ అని పిలిచేవారు. క్రీస్తుశకం 993 తర్వాత కోలా వంశీయుల పరిపాలనలో ఈ దేశం ‘ముమ్ముడి కోలమండలం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. గ్రీక్‌ భౌగోళిక శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని ‘టాప్రోబానా’గా.. పర్షియన్లు, అరబ్‌లు ‘సారాందాబ్‌’గా పిలిచారు. అయితే, చివరగా 1505లో పోర్చుగీస్‌ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి పోర్చుగీసు ప్రభుత్వం దీనికి ‘సీలోన్‌’ అని పేరు పెట్టింది. ఆ తర్వాత బ్రిటన్‌ ప్రభుత్వం సైతం ఈ ప్రాంతాన్ని సీలోన్‌గానే పిలుస్తూ పరిపాలించింది. స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1972లో అప్పటి ప్రభుత్వం దేశం పేరును సీలోన్‌ నుంచి ‘శ్రీలంక’గా మార్చింది. సీలోన్‌ ఒక ఐలాండ్‌(లంక) కాబట్టి.. దానికి శ్రీ అనే పదం జోడించి శ్రీలంకగా మార్పు చేసింది. అయితే, ఇప్పటికీ కొన్ని సంస్థల కార్యాలయాల బోర్డులపై దేశం పేరును సీలోన్‌గానే రాసుకుంటున్నారు. 

2. Czech Republic to Czechia - చెకియా

చెక్‌ రిపబ్లిక్‌ ప్రాంతానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ ప్రాంతాన్ని మొదట్లో బోహెమియా అని పిలిచేవారు. స్లావిక్‌ తెగ నాయకుడు చెక్‌.. ఈ బోహెమియా దేశానికి ప్రజలతో వచ్చి ఇక్కడ స్థిర పడ్డాడట. ఈ తెగ మాట్లాడే భాషను కూడా చెక్‌ అనే అంటారు. ఈ దేశాన్ని బోహెమియా, మోరావియా, చెక్‌ సిలెసియా.. అని మూడు భాగాలు విభజించారు. ఈ దేశానికి అనేక పేర్లు ఉన్నాయి. చెక్‌/బోహెమియన్‌ లాండ్స్‌, బోహెమియాన్‌ క్రౌన్‌, చెకియా, లాండ్స్‌ ఆఫ్‌ క్రౌన్‌ ఆఫ్‌ సెయింట్‌ వెన్సెస్లాస్‌ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ దేశం ఆస్ట్రో-హంగేరీ సామ్రాజ్యంలో భాగమైంది. 1918లో ఈ దేశం స్వాతంత్ర్యం సాధించుకుంది. చెక్‌, స్లోవక్‌ జాతీయులు కలిసే ఉన్నారన్న సందేశం ఇవ్వడం కోసం దేశానికి ‘చెకోస్లోవేకియా’గా నామకరణం చేశారు. అయితే 1992లో చెకోస్లోవేకియా కూడా విడిపోవడంతో ‘చెక్‌ రిపబ్లిక్‌’ ఏర్పడింది. అయితే, అందరూ ఈ దేశాన్ని చెక్‌ రిపబ్లిక్‌ అని పిలుస్తున్నా.. అక్కడి ప్రభుత్వం మాత్రం దేశానికి అధికారికంగా, సంక్షిప్త నామంగా ‘చెకియా’ పేరును ప్రతిపాదించింది. గతంలోనూ ఈ దేశానికి ఈ పేరు ఉండేది. అయితే, 2016లో ఈ పేరును అధికారికంగా మార్చింది. దేశం పేరును పలకడంలో, రాయడంలో సులువుగా ఉండేలా చేయడం కోసమే ఈ మార్పు చేశారట. 

3. Swaziland to Eswatini - ఎష్వతిని

స్వాజిలాండ్‌ ఆఫ్రికా ఖండంలోని ఓ దేశం. ఒకప్పుడు ఈ దేశం ఎష్వతిని రాజ్యంగా ఉండేది. స్వాజి తెగ ప్రజలు ఇక్కడ స్థిరపడటంతో స్వాజిలాండ్‌గా పిలుస్తున్నారు. అయితే 2018లో ప్రస్తుత స్వాజిలాండ్‌ చక్రవర్తి స్వాటి-III తమ దేశం పేరును తిరిగి ‘ఎష్వతిని’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వాజిలాండ్‌ను స్థానిక భాషలో ఎష్వతిని అంటారు. సొంతభాషలో దేశం పేరు ఉండాలని అక్కడి చక్రవర్తి మార్పు చేశారు. అయితే, కొందరు స్వాజిలాండ్‌ను స్విట్జర్లాండ్‌గా పొరబడుతున్నారట. ఈ దేశం పేరు మార్చడానికి ఇదీ ఒక కారణంగా తెలుస్తోంది. 

4. Burma to Myanmar - మయన్మార్‌

భారత్‌కు సమీపంలో ఉండే బర్మాను మయన్మార్‌ అని కూడా పిలుస్తారనే విషయం తెలిసిందే. నిజానికి ఎప్పటినుంచో ఈ దేశానికి బర్మా అనే పేరుంది. ఇక్కడి బామర్‌ ప్రజలు మాట్లాడే భాషను బర్మీస్‌/మైన్మ/బామా. దీంతో ఆ దేశాన్ని పిలవడంలో బర్మా/బామా అని, రాయడంలో మైన్మర్‌ అని వ్యవహరించేవారు. అలా బాహ్య ప్రపంచం ఈ దేశాన్ని బర్మా, మయన్మార్‌ రెండు పేర్లతోనూ పిలుస్తోంది. 1989లో అప్పటి ప్రభుత్వం స్థానిక భాషలో రాసిన పేరునే కొనసాగించాలని భావించి.. దేశానికి ‘మయన్మార్‌’ పేరును అధికారికంగా ప్రకటించింది. అయినా చాలా మంది ఈ దేశాన్ని బర్మాగానే గుర్తిస్తుంటారు. 

5. Siam to Thailand - థాయ్‌లాండ్‌

థాయ్‌లాండ్‌ను పూర్వం నుంచి స్థానిక ప్రజలు ముయాంగ్‌ థాయ్‌ అని పిలుచుకునేవారు. కానీ ఇతరులు థాయ్‌లాండ్‌ను సియామ్‌ అనేవారు. ఈ పదం పాలి భాష లేదా సంస్కృతం లేదా మొన్‌ భాష నుంచి పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, 1939లో అప్పటి సియామ్‌ చక్రవర్తి దేశానికి ‘థాయ్‌ లాండ్‌’అని పేరు పెట్టారు. స్థానిక భాషలో థాయ్‌లాండ్‌ అంటే స్వతంత్ర ప్రజలున్న దేశం అనే అర్థం. చైనా నుంచి స్వాతంత్ర్యం కోసం తొలిసారి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ థాయ్‌ ప్రజల గౌరవార్థం దేశానికి ‘థాయ్‌లాండ్‌’ అని పేరు పెట్టారట. 

6. Congo Free State to Congo - కాంగో

కాంగో దేశాన్ని ఒకప్పుడు ‘కాంగో ఫ్రీ స్టేట్‌’, ‘బెల్జియం కాంగో’, ‘కాంగో-లియోపొల్డివిల్లే’ అని పిలిచేవారు. దేశంలో కాంగో నది ఉంది. దాని వల్లే ఈ దేశానికి ఈ పేరు వచ్చింది. 1960లో కాంగో బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ‘రిపబ్లిక్‌ ఆఫ్ కాంగో’గా దేశానికి నామకరణం చేశారు. 1965 నుంచి 1971 మధ్య ఈ దేశాన్ని ‘డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో’గా మార్చారు. 1971లో అప్పటి దేశాధ్యక్షుడు మొబుటు సెసె సెకో దేశం పేరును ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ జైర్‌’గా మార్చగా.. అక్కడి నేషనల్‌ కాంగ్రెస్‌ పాత పేరు వైపే మొగ్గుచూపింది. దీంతో మళ్లీ దేశానికి ‘డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్ ది కాంగో’గా పేరు వచ్చింది. 

7. Democratic Kampuchea to Cambodia - కాంబోడియా

కాంబోడియా దేశానికి అనేక సార్లు పేర్ల మార్పులు జరిగాయి. 14వ శతాబ్దం నుంచే యూరప్‌కు కాంబోడియా దేశం గురించి తెలుసు. మొదట్లో ఈ దేశం ఖేమర్‌, కంపుచేయా రాజ్యాలుగా ఉండేవి. ఈ పదాలు సంస్కృతంలోని ‘కాంబోజ్‌దేశ్‌’ అనే పదం నుంచి పుట్టుకొచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. కంపుచేయా పదాన్ని తప్పుగా పలకడంతో కాంబోడియాగా మారిందనే వాదనలున్నాయి. 1953-70 మధ్య దేశాన్ని ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ కాంబోడియా’గా మార్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనపెట్టి తమ హయాం 1970-75 మధ్య దేశానికి ‘ఖైమర్‌ రిపబ్లిక్‌’గా నామకరణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం 1975-79 వరకు కాంబోడియాను ‘డెమోక్రటిక్‌ కంపుచేయా’గా పేర్కొంది. అయితే, 1989 తర్వాత ఐక్యరాజ్యసమితి ఈ దేశానికి ‘స్టేట్‌ ఆఫ్‌ కాంబోడియా’గా పేరు పెట్టింది. 1993లో మళ్లీ రాచరికం మొదలైంది. అప్పుడు కాంబోడియాను ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ కాంబోడియా’గా మార్చారు. ప్రస్తుతం ఈ దేశాన్ని కాంబోడియా అంటున్నా. అక్కడి ప్రజలు మాత్రం కంపుచేయాగానే పిలుచుకుంటున్నారు. ఇవే కాదు.. ఒకప్పటి పర్షియాను ఇరాన్‌గా, ట్రాన్స్‌జోర్డాన్‌ను జోర్డాన్‌గా, అబిస్సినియాను ఎథియోపియాగా, జర్మన్‌ సౌత్‌ వెస్ట్‌ ఆఫ్రికా పేరు నమీబియాగా మారాయి. మరికొన్ని దేశాలకు కూడా వివిధ కారణాలతో పేర్లు మారాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags