Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Zika Virus Cases in UP's Kanpur

 

Zika Virus Cases in UP's Kanpur

కాన్పూర్‌లో జికా వైరస్‌ వ్యాప్తి - ఒక్కరోజే 14 కేసులు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపించడం కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే కొత్తగా 14 కేసులు వెలుగులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో సమావేశం నిర్వహించారు. జికా సోకినవారిలో ఓ గర్భిణి కూడా ఉన్నట్టు సమాచారం.

గతంలో 11 కేసులు ఉండగా.. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి కాన్పూర్‌లో మొత్తం జికా కేసుల సంఖ్య 25కి పెరిగింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు తెలిపారు. 

ఏమిటీ జికా వైరస్‌? 

జికా వ్యాధి జికా వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO)  ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. 

ఎలా వ్యాపిస్తుంది? 

ఈ వైరస్‌ కలిగిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. అంతేకాకుండా లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గర్భిణులకు ఈ వ్యాధి సోకినట్లయితే పుట్టబోయే పిల్లలకూ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలు మైక్రోసెఫాలి (తల చిన్నగా ఉండటం) అనే లక్షణంతో ఉంటారు. 

లక్షణాలేంటి? 

జ్వరం, చర్మంపై దద్దుర్లు; కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, లింఫ్‌ గ్రంథులు ఉబ్బడం లాంటి లక్షణాలు కనబడతాయి. 

ఎలా నిర్ధారిస్తారు? చికిత్స ఏమిటి? 

ఈ వ్యాధిలో రక్త నమూనాలను రియల్‌టైమ్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌  (RT - PCR)  ద్వారా నిర్ధారించవచ్చు. జికా వ్యాధికి నిర్దిష్టమైన చికిత్సంటూ ఏమీలేదు. రోగి లక్షణాలను గమనించి వైద్యం అందిస్తారు. రోగులకు విశ్రాంతి అవసరం. వీరు ఎక్కువగా నీటిని తాగాలి. జ్వరం తగ్గడానికి పారాసిటమల్‌ లాంటి ఔషధాలను ఇవ్వాలి. ఈ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత రెండోసారి రాదు. 

నివారణా చర్యలేంటి? 

దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొడుగైన షర్ట్‌, ప్యాంట్‌ను ధరించాలి. రెండు నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు దోమ తెరను వాడాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags