NASA Spacecraft 'Touches the Sun' For the
First-Time Ever
సూర్యుడిని తాకిన పార్కర్ సోలార్
ప్రోబ్ వ్యోమనౌక - ఖగోళ పరిశోధనల్లో కీలక మైలురాయి
అసాధ్యమని ఒకప్పుడు భావించిన పనిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా సుసాధ్యం చేసింది. ఆ సంస్థ ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక.. సూర్యుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. అక్కడ ఉష్ణోగ్రత 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉంటుంది. దాన్నిబట్టి నాసా సాధించిన ఘనత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సౌర వాతావరణం, విశ్వంలోని ఇతర నక్షత్రాలకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులను విప్పే దిశగా ఇది కీలక ముందడుగు కానుంది.
కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు జరపడమే ప్రాథమిక లక్ష్యంగా నాసా మూడేళ్లక్రితం పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించింది. ఏడు విన్యాసాలు చేపట్టడం ద్వారా దాన్ని 26సార్లు సూర్యుడికి అత్యంత చేరువగా (పెరీహీలియన్) తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. అంతకుముందు ఏడుసార్లు కరోనాకు సమీపంగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 8వ పెరీహీలియన్‌తో తొలిసారి ఏకంగా కరోనా పొరలోకి ప్రవేశించింది. సంపూర్ణ సూర్యగ్రహణ సమయాల్లో కనిపించే కరోనల్ నిర్మాణాల గుండా ప్రయాణించింది. భవిష్యత్ పరిశోధనల కోసం కొన్ని రేణువులనూ సేకరించింది. అయస్కాంత క్షేత్ర డేటా, సౌరగాలుల డేటా విశ్లేషణ ద్వారా- పార్కర్ ప్రోబ్ కరోనా వలయంలోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు.
అద్భుత పురోగతి
సూర్యుడి ఉపరితలం ఘనరూపంలో ఉండదు. ఈ నక్షత్ర గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రం.. ప్లాస్మాను పట్టి ఉంచలేనంత బలహీనంగా ఉన్న అంచును ‘ఆల్ఫ్‌వెన్’ ఉపరితలంగా పిలుస్తారు. దాన్నే సూర్యుడి సరిహద్దుగా పరిగణిస్తారు. దాని తర్వాతిభాగం నుంచి సౌరగాలులు ఉత్పత్తయి.. సౌర కుటుంబం గుండా బలంగా వీస్తాయి. ‘ఆల్ఫ్‌వెన్’ ఉపరితలం ఎక్కడుంది? అక్కడి వాతావరణం ఎలా ఉంది? వంటి వివరాలేవీ ప్రస్తుతం తెలియవు. దాని గుట్టువిప్పడం పార్కర్ ప్రోబ్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. సూర్యుడి కేంద్రభాగం నుంచి 10-20 సోలార్ రేడియై మధ్య భాగంలో ఆల్ఫ్‌వెన్ ఉంటుందని అంచనా. అంటే.. సూర్యుడి కేంద్రభాగం నుంచి దాదాపు 43 లక్షల మైళ్ల దూరంలో ప్రారంభమై.. 86 లక్షల మైళ్ల దూరం వరకు అది విస్తరించి ఉంటుంది. తాజాగా పార్కర్ 19.7 సోలార్ రేడియై వద్ద కరోనా పొరలోకి ప్రవేశించి.. ఓ దశలో 18.4 సోలార్ రేడియై (సూర్యుడి కేంద్ర భాగం నుంచి 79లక్షల మైళ్లు) దూరం వరకూ వెళ్లింది. మొత్తంగా కరోనా పొరలో దాదాపు ఐదు గంటలపాటు ఉండి.. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో హెచ్చుతగ్గులను గుర్తించింది. సౌర కుటుంబానికి గుండెకాయలాంటి ఆ ప్రాంతానికి సంబంధించి మునుపెన్నడూ అందుబాటులో లేని డేటాను శాస్త్రవేత్తల చేతికి అందించింది. ఆల్ఫ్‌వెన్ ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉన్నట్లు వారు గుర్తించారు. సూర్యుడికి ఇంకా దగ్గరగా వెళ్లినప్పుడు సూడోస్ట్రీమర్ అనే అయస్కాంత క్షేత్రం వ్యోమనౌకకు ఎదురైంది. చుట్టూ ఉన్నదాంతో పోలిస్తే అక్కడి వాతావరణం కాస్త నిలకడగా కనిపించింది. సౌరగాలుల అయస్కాంత క్షేత్రంలో వచ్చే ‘జడ్’ ఆకృతిలోని మెలికలు- ‘సోలార్ స్విచ్‌బ్యాక్’లలో కొన్ని.. దిగువ కరోనా నుంచీ వస్తుంటాయని వ్యోమనౌక తాజాగా గుర్తించింది.
మున్ముందు మరింత చేరువగా..
మున్ముందు విన్యాసాల్లో భాగంగా.. సూర్యుడి కేంద్రభాగం నుంచి 9.86 సోలార్ రేడియై దూరం వరకూ పార్కర్ వెళ్లనుంది. అంటే భానుడి గురించి ఇప్పటివరకూ ఎన్నడూ అందుబాటులో లేని మరెన్నో వివరాలు ఇకపై తెలిసే అవకాశముంది.
అంత ఉష్ణోగ్రతను ఎలా తట్టుకుంది?
నాసాతోపాటు పలు ఇతర పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్ ప్రోబ్‌ను సంయుక్తంగా రూపొందించారు. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా దానిచుట్టూ పటిష్ఠ కవచం ఉంటుంది. నమూనాలను సేకరించేందుకు ఉపయోగించేందుకు బిగించిన కప్, మరో పరికరం మాత్రం కవచం బయట ఉంటాయి. వాటిపై సూర్యకాంతి నేరుగా పడుతుంది. అవి కరిగిపోకుండా టంగ్‌స్టన్, నియోబియం, మాలిబ్డినమ్, సఫైర్ వంటి పదార్థాలతో వాటిని తయారుచేశారు.
* సూర్యుడి ఉపరితలం కంటే.. దాని బాహ్య వాతావరణంలోనే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత దాదాపు 5,500 డిగ్రీల సెల్సియస్. బాహ్య వాతావరణంలో మాత్రం ఏకంగా 20 లక్షల డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతుంటుంది.
పార్కర్ ప్రోబ్‌ను ఎప్పుడు
ప్రయోగించారు?
2018
కరోనా పొరలోకి తొలిసారి ఎప్పుడు
ప్రవేశించింది?
2021 ఏప్రిల్ 28న
🔥 Hot off the press! 🔥
— NASA Sun & Space (@NASASun) December 14, 2021
We’ve touched the Sun! 👉☀️ Parker Solar Probe has now flown through the Sun’s upper atmosphere, the corona. Flying so close is revealing new things about our star, like where features called switchbacks are born. Learn more: https://t.co/Eaq0CJXvu1 pic.twitter.com/TTB3TPbPFe
0 Komentar