What is Tornado? Is Tornado Outbreak
Related to Climate Change?
ఏమిటీ టోర్నడో? అవి
ఎలా ఏర్పడతాయి? అమెరికాలోనే ఎందుకు ఎక్కువ వస్తాయి?
ఇటీవల అమెరికాలో విరుచుకుపడిన అకాల టోర్నడో పెను బీభత్సాన్ని సృష్టించింది. ఇక్కడ డిసెంబరులో భీకర తుపాన్లు చాలా అరుదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ టోర్నడో తీవ్రత, విస్తృతి వాతావరణ శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదో కొత్త కేటగిరీ కిందకు వస్తుందని వారు చెబుతున్నారు. వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ టోర్నడో నేలపై కొనసాగిందని అంచనా. వేడి వాతావరణం దీనికో ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇది ఇంతలా విరుచుకుపడడం వెనుక వాతావరణ మార్పులు ఏ మేరకు కారణమయ్యాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.
ఏమిటీ టోర్నడో?
ఇది సుడులు తిరుగుతూ నిట్టనిలువుగా
చోటుచేసుకునే వాతావరణ పోకడ. ఉరుములు, మెరుపులను కలిగించే
మేఘాల్లో (థండర్ క్లౌడ్స్) ఇవి ఏర్పడుతుంటాయి. గరాటా ఆకృతిలో నేలవరకూ
విస్తరిస్తాయి. భీతావహ వేగంతో దూసుకెళతాయి. అవి పయనించే మార్గంలో పెను విధ్వంసం
సృష్టిస్తాయి. నీటి తుంపర్లు, ధూళి, దుమ్ము,
ఇతర శకలాలతో ఇవి తయారవుతుంటాయి.
ఎలా ఏర్పడతాయి?
* టోర్నడోలు అసాధారణ స్థాయి
వేడి ఉన్నప్పుడు ఏర్పడతాయి. నేలపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి
వేడెక్కి, పైకి లేస్తుంది.
* ఇలా వేడి, తేమతో కూడిన గాలి.. ఎగువన ఉన్న చల్లటి, పొడి పవనాలను
తాకినప్పడు థండర్ క్లౌడ్స్ ఏర్పడుతుంటాయి. దీన్ని ‘వాతావరణ అస్థిరత’గా
అభివర్ణిస్తుంటారు. అది జరిగినప్పుడు గాలిపైకి కదలడం మొదలుపెడుతుంది. దీన్ని ‘అప్‌డ్రాఫ్ట్’
అంటారు.
* విభిన్న ఎత్తుల్లో గాలుల
వేగం, దిశల్లో మార్పుల (విండ్ షియర్) కారణంగా ఈ అప్‌డ్రాఫ్ట్
సుడి తిరగడం మొదలవుతుంది.
* దిగువ వాతావరణంలో కొన్ని
వేల అడుగుల పాటు ఈ వైరుధ్యం గణనీయ స్థాయిలో ఉన్నప్పుడు.. టోర్నడోను కలిగించే సూపర్‌సెల్
థండర్ క్లౌడ్స్ ఏర్పడతాయి. అమెరికాలో శనివారం జరిగింది ఇదే.
* శీతాకాలంలో గాలిలో పెద్దగా వేడి, తేమ ఉండదుకాబట్టి టోర్నడోలకుఅవసరమైన స్థాయిలో అస్థిరతకు తావుండదు. అమెరికాలో ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితుల వల్లే..
అమెరికాలోని మిడ్‌వెస్ట్, దక్షిణ
ప్రాంతాల్లో డిసెంబర్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వేడి, తేమతో కూడిన గాలి అక్కడికి వచ్చి చేరింది. ఇవి థండర్ క్లౌడ్స్
ఏర్పరిచాయి. దీనికి ‘లా నినా’ అనే వాతావరణ పోకడ కొంత మేర కారణమైంది. భూతాపం
పెరుగుతున్న కొద్దీ శీతాకాలంలో వేడి వాతావరణం సర్వసాధారణంగా మారుతోందని
శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
* శనివారం నాటి ఘటనలో..
తుపాను తలెత్తాక అసాధారణ స్థాయిలో విండ్ షియర్ బలంగా ఉండటంతో టోర్నడో త్వరగా
బలహీనపడకుండా చేసింది.
* టోర్నడోలు సాధారణంగా
నిమిషాల్లో శక్తిహీనమవుతుంటాయి. తాజా ఉదంతంలో మాత్రం అవి కొన్ని గంటల పాటు సాగాయి.
అందువల్లే అది దాదాపు 322 కిలోమీటర్ల దూరం పయనించినట్లు
సమాచారం.
* 1925లో నాలుగు
రాష్ట్రాలను కుదిపేసిన టోర్నడో 352 కిలోమీటర్లు
దూసుకెళ్లింది. శనివారం నాటి టోర్నడో
అంతకన్నా ఎక్కువ దూరం పయనించి ఉండొచ్చని కొందరు అంచనావేస్తున్నారు.
* సుదీర్ఘ దూరం
పయనించడానికి ఈ పెను తుపాను చాలా వేగంగా కదులుతుండాలి. తాజా టోర్నడో చాలా వరకూ
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
* మరే దేశంలో లేని విధంగా
అమెరికాలో ఏటా 1200 టోర్నడోలు సంభవిస్తున్నాయి.
0 Komentar