Omicron Survives Over 21 Hours on Skin,
More Than 8 Days on Plastic: Study
ఏ కోవిడ్ వేరియంట్ ఎన్ని గంటలు ప్లాస్టిక్, చర్మంపై సజీవంగా ఉంటుంది? జపాన్ పరిశోధకుల అధ్యయనంలో కొత్త అంశాలు ఇవే
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను నీడలా వెంటాడుతూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, గామా వేరియంట్లుగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా.. తాజాగా ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. గతంలో వచ్చిన వేరియంట్లన్నింటి కన్నా దీని ప్రభావం తక్కువే అయినా.. మనుషుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ వైరస్ ఎన్నిగంటల పాటు పర్యావరణంలో జీవించి ఉంటుందనే అంశంపై జపాన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్ వేరియంట్ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ.. అదే ప్లాస్టిక్ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఒమిక్రాన్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇదేనని తెలిపింది.
అందువల్లే ఒమిక్రాన్ అధిక
వ్యాప్తి
మనిషి శరీరంలో కాకుండా బయట పరిసరాల్లో కొవిడ్ 19, ఇతర కొత్త వేరియంట్లు ఎంత కాలంపాటు జీవించి ఉంటాయనే అంశాన్ని విశ్లేషించిన పరిశోధకుల బృందం పలు అంశాలను గుర్తించింది. ఈ పీర్ రివ్యూ అధ్యయనాన్ని bioRxivలో ఇటీవల పోస్ట్ అయింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్ స్ట్రెయిన్ (కొవిడ్ 19)తో పోలిస్తే రెండు రెట్లు కన్నా అధికంగా చర్మం, ప్లాస్టిక్‌పై జీవించగలవట. అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్లే ఈ వేరియంట్లతో ఎక్కువ వ్యాప్తి జరిగినట్టు పేర్కొన్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉందని.. అందువల్లే డెల్టా రకంతో పోలిస్తే శరవేగంగా వ్యాప్తి జరుగుతున్నట్టు గుర్తించారు.
ప్లాస్టిక్, చర్మంపై
ఏ వేరియంట్ ఎన్ని గంటలు?
ఈ అధ్యయనం ప్రకారం.. ఒమిక్రాన్
వేరియంట్ ప్లాస్టిక్ ఉపరితలంపై 193.5 గంటల పాటు అంటే దాదాపు
8 రోజులు జీవించగలదట. వుహాన్ వేరియంట్‌తో పోలిస్తే ఇది మూడు
రెట్లు అధికం. అలాగే, ఒరిజినల్ స్ట్రెయిన్ 56 గంటలు, ఆల్ఫా 191.3, బీటా 156.6 గంటలు, గామా 59.3గంటలు,
డెల్టా 114 గంటల పాటు ప్లాస్టిక్ ఉపరితలాలపై
జీవించగలవని గుర్తించారు. ఇకపోతే, చర్మం నమూనాపై ఒమిక్రాన్ 21.1గంటల పాటు సజీవంగా ఉండగా.. ఒరిజినల్ స్ట్రెయిన్ 8.6 గంటలు, ఆల్ఫా 19.6 గంటలు,
బీటా 19.1
గంటలు, గామా 11గంటలు, డెల్టా వేరియంట్ 16.8గంటలు సజీవంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, ఆల్ఫా,
బీటా వేరియంట్ల మధ్య పర్యావరణ స్థిరత్వంలో పెద్దగా తేడాఏమీ కనబడలేదని
పేర్కొన్నారు. తగిన సాంద్రత కలిగిన ఆల్కాహాల్‌తో తయారైన శానిటైజర్‌తో చేతుల్ని
శుభ్రం చేసుకుంటే 15 సెకన్లలోనే వైరస్ అంతమవుతుందని
తెలిపారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం
చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
0 Komentar