USA Sees Highest-Ever Over 10 Lakhs Fresh
Covid Cases in One Single Day
అమెరికాలో ఒక్కరోజే 10లక్షలకు పైగా
కొత్త కేసులు - నూతన సంవత్సర వేడుకలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం
కోవిడ్ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే అక్కడ 10లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు అమెరికా వార్తా సంస్థ యూఎస్‌ఏ టుడే కథనం వెల్లడించింది.
గత వారాంతంలో నూతన సంవత్సర వేడుకలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో కొత్త కేసుల సంఖ్య గతంలో కంటే మూడు రెట్లు పెరిగి.. ఒక్క రోజే 10లక్షలు దాటాయని సదరు కథనం పేర్కొంది. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి 7.30 గంటల వరకు అమెరికా వ్యాప్తంగా 10,42,000 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు గత గురువారం అమెరికాలో ఒక్కరోజే 5.91లక్షల కేసులు బయటపడగా.. తాజాగా దానికి రెట్టింపు కేసులు నమోదవడం కలవరపెడుతోంది. గత వారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్ బారినపడినట్లు యూనివర్సిటీ పేర్కొంది.
కొత్త కేసులు పెరుగుతుండటంతో అమెరికాలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం లక్షకు పైగా కొవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలో ఉన్నవారి సంఖ్య 18వేలకు పైనే ఉందని అధికారులు తెలిపారు. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది ఆసుపత్రి పాలవ్వగా.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో ఆసుపత్రుల్లో చేరికలు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.
8లక్షలు దాటిన మరణాలు..
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 5.5కోట్ల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. అంటే దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా సోకింది. ఇక ఇప్పటివరకు 8.26లక్షలకు పైగా మందిని మహమ్మారి బలితీసుకున్నట్లు జాన్ హాప్కిన్స్ డేటా వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 62శాతం మంది అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరికి బూస్టర్ డోసులను కూడా పంపిణీ చేస్తున్నారు.
12-15 ఏళ్ల వారికి బూస్టర్
డోసులు..!
ఇక అమెరికాలో ఈ దఫా ఉద్ధృతి
చిన్నారులపై ప్రభావం చూపిస్తోంది. ప్రతి రోజూ 500 కంటే ఎక్కువ మంది
పిల్లలు వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నారని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్
కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇప్పటికే అక్కడ 12ఏళ్ల
పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా.. 5-11 ఏళ్ల
మధ్య చిన్నారులకు కూడా టీకా పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు 12-15 ఏళ్ల వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఫుడ్
అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం అనుమతినిచ్చింది. ఈ వయసు వారికి రెండో
డోసు తీసుకున్న 5-6 నెలల తర్వాత బూస్టర్ డోసు ఇచ్చేందుకు
అంగీకరించింది. అయితే దీనిపై సీడీసీ నుంచి ఇంకా అనుమతులు రాలేదు.
0 Komentar