మండలానికి 2
జూనియర్ కళాశాలలు - 22వేల మంది టీచర్లకు పదోన్నతులు
మండలానికి రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉన్నత పాఠశాలలనే జూనియర్ కళాశాలలుగా మార్చాలని సూచించారు. వాటిలో ఒకటి కో ఎడ్యుకేషన్, రెండోది కేవలం విద్యార్థినుల కోసమే ఉండాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన పాఠశాల విద్యా శాఖపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో కలిసి సమీక్షించారు. ‘వచ్చే ఏడాది జూన్ నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి.
22 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు
కొత్తగా ఏర్పాటవుతున్న పాఠశాలలతో 22 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయి. వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా జూన్ నాటికి పదోన్నతులు ఇవ్వాలి’ అని ఆదేశించారు.
కొత్తగా చేరిన విద్యార్థులకు నిఘంటువు
పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు నిఘంటువులు అందించి, ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పాలి. 8, 9, 10 తరగతులకు డిజిటల్ విధానంలో బోధించాలి. దీన్నొక సబ్జెక్ట్‌గా పెట్టేలా ఆలోచించాలి. విద్యా కానుక, మరుగుదొడ్ల నిర్వహణ, గోరుముద్దలో నాణ్యత, పాఠశాలల నిర్వహణలో సమస్యలు తెలుసుకోడానికి ఏర్పాటు చేస్తున్న టోల్‌ఫ్రీ నంబరు 14417 సమర్థంగా పని చేయాలి’ అని సీఎం సూచించారు.
ఎస్‌ఈఆర్టీ సిఫార్సులకు ఆమోదం - ఎంఈవో పోస్టుల భర్తీ
పాఠశాల విద్యకు సంబంధించి ఎస్‌ఈఆర్టీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించారు. వాటిలో... మండల రిసోర్సు సెంటర్ పేరును మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పు. ఎంపీడీవోకి కాకుండా ఎంఈవోకి డ్రాయింగ్ అధికారాలు, విద్య సంబంధిత కార్యకలాపాలన్నీ ఎంఈవోలకు అప్పగింత. ఎంఈవో పోస్టుల భర్తీ. యాప్స్ కన్నా... రియల్ టైం డాటా ఉండేలా చూడటం. ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాజరుతోపాటు మార్కుల నమోదు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించరాదు... తదితర సిఫార్సులు ఉన్నాయి.
పాఠశాలలను విలీనం చేయడం లేదు: అధికారులు
నూతన విద్యా విధానంలో తరగతులు
తప్పితే పాఠశాలలను విలీనం చేయడం లేదని సీఎంకు అధికారులు వివరించారు. పాతవి ఎట్టి
పరిస్థితుల్లోనూ మూతపడవన్నారు. దీనిపై కొందరు అపోహ పడుతున్నారని అన్నారు.
0 Komentar