పీఆర్సీ: ‘చలో
విజయవాడ’ విజయవంతం - ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం ఆగదు : పీఆర్సీ సాధనసమితి
ఏపీ ప్రభుత్వం జీవోలకు వ్యతిరేకంగా
పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతమైనట్లు నేతలు
ప్రకటించారు. జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ
భారీ సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన
ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఎన్జీవో భవన్ నుంచి అలంకార్ థియేటర్ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు
ర్యాలీగా ముందుకు సాగారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పీఆర్సీ సాధనసమితి నేతలు
మాట్లాడారు.
ఉద్యోగులది బల ప్రదర్శన కాదు..
వేదన: బొప్పరాజు వెంకటేశ్వర్లు
తమది బలప్రదర్శన కాదని.. ఉద్యోగుల
వేదనే ‘చలో విజయవాడ’ అని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
అడ్డంకులు ఎన్ని ఉన్నా ఉద్యోగులు తరలి వచ్చారని చెప్పారు. ఈనెల 5
నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని.. 6వ తేదీ అర్ధరాత్రి
నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు బొప్పరాజు తెలిపారు. నాలుగు స్తంభాలాటకు
అడ్డుకట్టవేయాలని ప్రభుత్వానికి ముందే చెప్పామని అన్నారు. డిమాండ్లు నెరవేర్చే
వరకు తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని
ఆరోపించారు.
‘‘ప్రభుత్వం ఇలాంటి పీఆర్సీ
ప్రకటించడం ఒక చరిత్ర.. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ఈనెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతాం. ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే
ఆ బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగుల ఉద్యమమంటే
ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలి. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు.
ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు
అన్నారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం:
వెంకట్రామిరెడ్డి
‘చలో విజయవాడ’కు భారీగా
ఉద్యోగులు తరలి వచ్చారని.. ఇప్పటికైనా తమ ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలని పీఆర్సీ
సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని
కొనసాగిస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు చేయాలని.. పొరుగుసేవల సిబ్బందికి సమాన
పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసును
క్రమబద్ధీకరించాలన్నారు.
ప్రభుత్వాధినేతగా సీఎం జగన్
చర్చలకు ఆహ్వానించాలి: బండి
ప్రభుత్వాధినేతగా సీఎం జగన్
ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు
అన్నారు. పీఆర్సీ అంశంలో జగన్ నేరుగా ఉద్యోగులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు.
తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని.. సీఎం జోక్యం చేసుకుని తమ సమస్యలను
పరిష్కరించాలన్నారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది వేతనాలు పెంచాలని
డిమాండ్ చేశారు.
అప్పటి వరకు సజ్జల మొహం
చూడొద్దన్నారు: సూర్యనారాయణ
ఉద్యోగులకు రక్షణ కవచంగా తమ నాలుగు సంఘాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ అన్నారు. తమ మధ్య గాలి కూడా చొరబడడానికి అవకాశం లేని విధంగా ఐక్యంగా ఉంటామని.. ఆత్మసాక్షిగా ఉద్యోగుల ముందు నిలబడతామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వితండ వాదాన్ని వీడనాడి మాయ లెక్కల నుంచి బయటకు రావాలని.. వాస్తవాలను అంగీకరించాలన్నారు. పీఆర్సీ జీవోల వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొహం చూడొద్దని ఉద్యోగులు చెప్పారన్నారు. హెచ్ఆర్‌ఏ పాత శ్లాబులు యథాతథంగా కొనసాగించాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
0 Komentar