Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Legendary Singer Lata Mangeshkar India's Nightingale, Dies At 92

 


Legendary Singer Lata Mangeshkar India's Nightingale, Dies At 92

ప్రముఖ గాయని, గానకోకిల లతా మంగేష్కర్ ఇక లేరు

ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లత మంగేష్కర్(92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

ఐదో యేటనే మొదలైన పాటల ప్రస్థానం..

ప్రముఖ థియేటర్ యాక్టర్, క్లాసికల్ సింగర్ అయిన పండిట్ దీనానాథ్ మంగేష్కర్, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్ 28న లతామంగేష్కర్ జన్మించారు. తల్లిదండ్రులు తొలుత ఆమెకు హేమ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లతగా నామకరణం చేశారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్, మీనా కదికర్లు లత మంగేష్కర్ కు తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించటం మొదలు పెట్టారు. లత పాఠశాలకు వెళ్లలేదు. ఒక రోజు తన సోదరి ఆశాను తీసుకుని పాఠశాలకు వెళ్లగా, ఉపాధ్యాయులు అనుమతించలేదు. అదే ఆమె పాఠశాలకు వెళ్లిన, మొదటి చివరి రోజు కావటం గమనార్హం. ఆపై సంగీత సాధన మొదలు పెట్టిన ఆమె తండ్రి మరణంతో నటిగా మారాల్సి వచ్చింది. ఒకవైపు నటిస్తూనే, మరోవైపు పాటలు పాడటాన్ని ఆమె ఆపలేదు.

తొలి పాట ఎడిటింగ్ లో పోయింది

లతా మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే, ఆ పాట సినిమాలో లేకపోవటం గమనార్హం. 1942లో 'కిటీ హసాల్ కోసం ఆమె పాడిన పాటను ఎడిటింగ్ లో తీసేశారు. వినాయక్ మాస్టర్ సంగీత సారథ్యం వహించిన 'పెహలీ మంగళాగౌర్ (1942)లో లతకు చిన్న వేషం ఇచ్చారు. ఇదే చిత్రంలో ఆమె నటాలీ చైత్రాచీ' అనే పాటలను పాడారు. హిందీలో 'మాట ఏక్ సఫూట్ కి దునియా బదల్ దా తు' అనే పాటకు మరాఠీ చిత్రం 'గజబావూ' కోసం పాడారు. 1945 లో వినాయక్ మాస్టర్ కంపెనీ ముంబయికి మారడంతో లత కూడా అక్కడే వెళ్లారు. ముంబయిలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. వేల పాటలను ఆలపించారు.

ఎన్ని పాటలో... ఎన్ని భాషలో.... తెలుగు పాట 'నిదురపోరా తమ్ముడా....

ఆమె పాటలకు భాషాభేదం లేదు. దేశంలోని అన్ని భాషలలోనూ ఆమె పాడారు. తెలుగులో ఆమె పాడిన పాటలలో ఎప్పటికీ మర్చిపోలేని పాట 'సంతానం'లోని 'నిదురపోరా తమ్ముడా.... 'అజారే పరేదశి... మైతో కబ్సే ఖడీ హూం..' అనే అద్భుతమైన పాటను 'మధుమతి' చిత్రంలో పాడే చక్కని అవకాశం ఇచ్చి, ఫిల్మ్ ఫేర్ ఉత్తమగాయనీ పురస్కారాన్ని అందించిన సంగీత దర్శకుడు సలీల్ ఛెదురీ అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఆమె ఆయనపై అభిమానంతో తన జీవితంలో ఒకే ఒక పాట 'కడలి...చెన కడలి')ను మలయాళంలోనూ పాడారు. ఆమెకు సంగీత దర్శకుడు మదన్ మోహన్ అంటే చాలా అభిమానం. ఆయన వద్ద వందల ట్యూన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిన లత, సుప్రసిద్ధ దర్శకుడు యశ్ చోప్రాకు ఆ సంగతి చెప్పి, ఆ ట్యూన్లను వాడుకుంటూ సినిమా తీయవచ్చు కదా' అని పోరి మరీ, 'వీర్ జరా' చిత్రాన్ని తీయించారు.

స్వరకర్తగా... వ్యవహర్తగా...

కేవలం గాయనిగానే కాకుండా లతా మంగేష్కర్ జీవితంలో ఇంకా చెప్పుకోదగ్గ కోణాలూ, విశేషాలూ అనేకం ఉన్నాయి. మనందరికీ ఆమె సుప్రసిద్ధ గాయనిగానే పరిచయం. నేపథ్య గాయనిగా మంచి పేరు వచ్చాక, తన పేరుతోనే 'రామ్ రామ్ పహ్వానే' అనే మరాఠీ చిత్రంతో సహా నాలుగు సినిమాలకు ఆమె సంగీత దర్శకత్వం వహించారు. నిర్మాతగానూ మారిన లత వాదాల్ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. తరువాత, 1955లో 'ఝంఝర్, 'కంచన్' చిత్రానూ, 1990లో 'లేకిన్' చిత్రాన్ని నిర్మించారు. వీటిలో 'ఝంఝర్ చిత్రాన్ని తనకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకుడు సి.రామచంద్రతో కలిసి నిర్మించడం విశేషం.

అత్యున్నత పురస్కారాలు ఆమెవే .!

భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గానూ తొలిసారి 1969లో పద్మ భూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత 1999లో పద్మ విభూషణ్ సత్కరించింది. 2001 భారత అత్యున్నత పురస్కారం 'భారతరత్న'ను అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణ్ చేతుల మీదుగా లతా మంగేష్కర్ అందుకున్నారు. 'దాదా సాహెబ్ ఫాల్కే(1989) అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం 'ది లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారం పొందారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags