Pulse Polio Drive in Telugu States from
Today (Feb 27)
తెలుగు రాష్ట్రాల్లో నేటి (ఫిబ్రవరి
27) నుంచి పోలియో చుక్కల పంపిణీ
ఆంధ్రప్రదేశ్:
రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు
ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కల పంపిణీ ఆదివారం నుంచి జరగనుంది. అన్ని పీహెచ్‌సీలు, సామాజిక,
ప్రాంతీయ, అంగన్‌వాడీలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ముఖ్య కూడళ్లలో పోలియో చుక్కల
పంపిణీ జరుగుతుంది.
సోమ, మంగళవారాల్లో
వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంకా టీకా వేయాల్సిన చిన్నారులు ఉంటే వారికీ
వేస్తారు. నాలుగో రోజు విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖ, రాజమహేంద్రవరం,
కాకినాడ కార్పొరేషన్ పరిధిలో టీకాకు దూరంగా ఉన్న వారిని గుర్తించి
పంపిణీ చేసేలా జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రత్యేక ప్రదేశాల్లో నివసించే సంచార
జాతుల కుటుంబాలకు చెందిన చిన్నారులకు చుక్కలు పంపిణీ చేసేందుకు 1,374 బృందాలు వాహనాల ద్వారా పర్యటిస్తాయి. టీకా పంపిణీకి రూ.7 కోట్ల వరకు వ్యయంకానుంది. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఈ ఖర్చును భరిస్తున్నాయి.
తెలంగాణ:
నిండు
జీవితానికి రెండు చుక్కలు వేయించాల్సిన సమయమొచ్చింది.. నేడు తెలంగాణ వ్యాప్తంగా
పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లలోపు
పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ శనివారం ఓ ప్రకటనను విడుదల
చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 38,31,907 మంది ఐదేళ్ల లోపు వయసు
పిల్లలుండగా, 23,331 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు
చేసినట్లు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్ కేంద్రాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
ఇక అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 50.14 లక్షల పల్స్ పోలియో డోసులు పంపారు. సంచార జాతులు, భిక్షాటన
చేసేవారు, ఇటుక బట్టీ కార్మికులు, భవన
నిర్మాణ కార్మికులు, మురికి వాడలు, ఆదివాసీ
పిల్లలపై సిబ్బంది ఈ సారి ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ క్రమంలోనే 2,337 మంది సూపర్‌వైజర్లు, 869 సంచార బృందాలు,
8,589 మంది ఏఎన్‌ఎంలు, 27,040 మంది
ఆశాకార్యకర్తలు, 35,353 మంది అంగన్వాడీలు పల్స్ పోలియో
కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులను
ప్రత్యేక బృందాల సాయంతో గుర్తిస్తారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ఆయా చిన్నారులకు
పోలియో చుక్కలు వేయనున్నారు..
0 Komentar