ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు -2022
– పూర్తి ఫలితాల వివరాలు ఇవే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
ఫలితాల్లో నాలుగు చోట్ల భాజపా సత్తా చాటింది. దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రమైన
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక స్థానాల్లో అఖండ విజయంతో మళ్లీ అధికార పగ్గాలు
చేపట్టబోతోంది. ఉత్తరాఖండ్, మణిపూర్‌లలోనూ భాజపా అధికారం
నిలబెట్టుకుంది. గోవాలో 20 స్థానాలతో అతి పెద్ద పార్టీగా
నిలిచింది. పంజాబ్‌లో ఆప్ దుమ్మురేపింది. అధికార కాంగ్రెస్‌తో పాటు భాజపాను
ఊడ్చేసి భారీ విజయం సొంతం చేసుకుంది.
1. యూపీ పీఠం మళ్లీ భాజపాదే
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి కమలం వికసించింది. యూపీలో అధికారం నిలబెట్టుకున్న భాజపా కూటమి మూడింట రెండొంతుల సీట్లు సొంతం చేసుకుంది. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. సాధారణ మెజార్టీకి 202 స్థానాలు అవసరం. అయితే, ఇప్పటికే 273 సీట్లను తన ఖాతాలో వేసుకున్న కమల నాథులు అఖండ విజయం సాధించారు. అలాగే, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూటమి 125 స్థానాలను గెలుచుకొని బలం పుంజుకోగా.. బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.
యోగి భారీ విజయం
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్
అర్బన్ స్థానంలో సమీప ఎస్పీ అభ్యర్థి శుక్లాపై 77వేలకు పైగా ఓట్ల
ఆధిక్యంలో విజయ ఢంకా మోగించారు. డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య సిరాతు
నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. కర్హల్ నుంచి పోటీచేసిన సమాజ్‌వాదీ పార్టీ
అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ 61వేల ఓట్లకు పైగా మెజార్టీతో
విజయం సాధించారు. జైలులో ఉండి పోటీ చేసిన ఎస్పీ నేత అజంఖాన్ రాంపూర్‌లో నెగ్గారు.
యోగి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో చేరిన
స్వామి ప్రసాద్ మౌర్య ఫజిల్‌నగర్‌లో పరాజయం పాలయ్యారు.
2. పంజాబ్‌లో ఆప్ క్లీన్‌స్వీప్
పంజాబ్‌లో అధికారం చేతులు మారింది. కాంగ్రెస్‌ను ఓడించిన ఆప్ భారీ మెజార్టీతో అధికార పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమైంది. 2017 ఎన్నికల్లో 20 స్థానాలను గెలిచిన ఆప్.. ఈసారి ఏకంగా 92 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. దిల్లీ మోడల్ మేనిఫెస్టోతో పంజాబ్ ఓటర్ల మనసు దోచిన ఆప్ జోరుకు కాంగ్రెస్, అకాలీదళ్ బడా నేతలు, మాజీ సీఎంలు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ పీఠం ఆప్ కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. 117 స్థానాలు కలిగిన పంజాబ్‌లో చీపురు పార్టీ 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో 77స్థానాలతో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈసారి 18 సీట్లకే పరిమితమైపోయింది. 2017లో 15 సీట్లు గెలిచిన శిరోమణి అకాలీదళ్ ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రాగా.. భాజపా గతం కన్నా ఒక స్థానం తగ్గి ఈసారి రెండుచోట్ల గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు.
ఆప్ చేతిలో హేమా హేమీలు చిత్తు
చిత్తు!
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్
ధూరి నియోజకవర్గం నుంచి 58,206 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజ్‌భవన్‌లో కాకుండా భగత్‌సింగ్
స్వగ్రామంలో ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న
కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా సీఎం పదవిలోకి వచ్చిన చన్నీ పోటీ చేసిన రెండు
చోట్లా పరాజయం పాలయ్యారు. బదౌర్ స్థానంలో 37,558 ఓట్లు,
చమ్‌కూరు షాహిబ్ స్థానంలో 7,942 ఓట్ల తేడాతో
చిత్తుగా ఓడిపోయారు. ఆయన కేబినెట్‌లో అనేకమంది మంత్రులు, సభాపతి
ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్
సిద్ధూ కనీసం పోరాడకుండానే చేతులెత్తేశారు. ఓటమిపై స్పందించిన సిద్ధూ.. ప్రజల
తీర్పు దేవుడి తీర్పుతో సమానమనీ.. దాన్ని గౌరవిస్తామని చెప్పారు. ఆప్‌కు
శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. మరోవైపు, కాంగ్రెస్
నుంచి బరిలో దిగిన సినీనటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌కు మొగ స్థానంలో ఓటమి
తప్పలేదు.
ఈ ఎన్నికల్లో ఆప్ జోరుకు మాజీ
సీఎంలకు పరాభవం తప్పలేదు. ఐదుసార్లు ముఖ్యమంత్రి, అకాలీదళ్ సీనియర్
నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ తన సొంత నియోజకవర్గమైన
లాంబీలో ఓటమిపాలయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్
జలాలాబాద్ స్థానంలో పరాజయం చెందారు. మరో మాజీ సీఎం, కాంగ్రెస్
నుంచి బయటకు వచ్చి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన అమరీందర్ సింగ్
పటియాలాలో ఓటమి చవిచూశారు.
3. దేవ్‌భూమిలో కొత్త చరిత్ర
ఉత్తరాఖండ్‌లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మార్చే సంప్రదాయాన్ని కాదని ఓటర్లు వరుసగా రెండోసారి అధికార భాజపాకే పట్టంకట్టారు. కాంగ్రెస్‌తో హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజార్టీతో మరోసారి కమలదళానికే అధికార పీఠం అందించారు. దేవ్‌భూమిలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. సాధారణ మెజార్టీకి 36స్థానాలు అవసరం. అయితే, భాజపా 47 చోట్ల విజయం సాధించి స్పష్టమైన మెజార్టీతో అధికారం నిలబెట్టుకుంది. ఖటియా నుంచి బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఓటమిపాలయ్యారు.
4. మళ్లీ కమలం చేతికే గోవా
గోవాలోనూ భాజపా మరోసారి అధికారం
చేపట్టనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అసవరమైన స్థానాలకు ఒకే ఒక్క సీటుదూరంలో
నిలిచిపోయిన కమలదళం స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం
చేసుకుంటోంది. ఇక్కడ అధికార భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించింది. గోవాలో మొత్తం 40
అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 20చోట్ల భాజపా అభ్యర్థులు
విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ 12 స్థానాలు
గెలుచుకోగా.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) రెండు, రివల్యూషనరీ గోన్స్ పార్టీ (ఆర్‌జీపీ) ఒకటి, స్వతంత్రులు మూడో చోట్ల విజయం
సాధించారు. పంజాబ్‌లో ఘన విజయం సాధించిన ఆప్.. గోవాలో రెండు స్థానాలను
గెలుచుకుంది.
5. మణిపూర్‌లోనూ భాజపాదే హవా..!
మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు
అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను భాజపా అందుకుంది. 32 స్థానాల్లో భాజపా
అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఇక్కడ మొత్తం 60 సీట్లు
ఉండగా.. అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు గెలవాల్సి
ఉంటుంది. అయితే, భాజపా 32 సీట్లు
గెలుచుకొని స్పష్టమైన మెజార్టీని సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఏడు చోట్ల
విజయం సాధించగా.. జనతాదళ్ (యూ) ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ 5,
ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.
0 Komentar