Regulate Mobile Phone Usage in Govt
Offices: HC
ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్‌ఫోన్ల
వినియోగాన్ని నియంత్రించండి - మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం
ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగులు తమ పని వేళల్లో
మొబైల్ ఫోన్లు, వాటి కెమెరాల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు
తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది.
దీనికి కచ్చితమైన నియమ, నిబంధనల్ని రూపొందించి అమల్లోకి
తేవాలంది. తిరుచ్చి ఆరోగ్య మండల కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న ఓ మహిళ
పని వేళల్లో సెల్‌ఫోన్ వాడుతున్నట్లు, వీడియోలు
చూస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండు చేశారు. దీన్ని
సవాలు చేస్తూ ఆమె మదురై బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం జస్టిస్ సుబ్రమణియం
ముందు మంగళవారం విచారణకు వచ్చింది.
విధుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్
వినియోగం పెరిగిందని కోర్టు అభిప్రాయపడింది. పని వేళల్లో కార్యాలయాల లోపలికి
మొబైల్ ఫోన్లను తీసుకురావడం, వీడియోలు తీసుకోవడం లాంటివి
స్వాగతించదగినవి కావంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత అవసరాలకు మొబైళ్లను
అనుమతించొద్దని పేర్కొంది. ఏదైనా అత్యవసరమైతే తమ పై అధికారి అనుమతి తీసుకుని సెల్‌లో
మాట్లాడొచ్చని స్పష్టత ఇచ్చింది.
విధుల్లో ఉన్నప్పుడు తోటి
ఉద్యోగులు, కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెల్‌ను
స్విచాఫ్, వైబ్రేషన్, సైలెంట్‌లో
ఉంచడం లాంటివి చేయాలని సూచించింది. కార్యాలయ సమయాల్లో మొబైల్ ఫోన్లను క్లాక్‌రూంలో
భద్రపరిచేలా, అత్యవసరమైనప్పుడే వాటిని వాడేలా చూడాలని
న్యాయమూర్తి పేర్కొన్నారు. కార్యాలయ అవసరాల కోసం ప్రత్యేక సెల్‌ఫోన్, టెలిఫోన్ ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సెల్ వాడకాన్ని తీవ్రంగా
పరిగణించి నియమ నిబంధనల్ని రూపొందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించారు.
నాలుగు వారాల్లోపు వాటిని ఆచరణలోకి తేవాలని ఉత్తర్వులిచ్చారు. సస్పెండ్ అయిన
ఉద్యోగి విషయంలో విచారణ చేపట్టాలన్నారు.
0 Komentar