Women's Day: Kerala Teacher Walks 16 Km A Day to Teach Tribal Children
పాఠాలు చెప్పేందుకు రోజూ అడవి మార్గాన
16 కి.మీ నడక - ఓ మహిళా ఉపాధ్యాయురాలి దినచర్య ఇది
కొండలు ఎక్కిదిగుతూ, సెలయేళ్లు
దాటుతూ 16 కిలోమీటర్ల నడక.. ఓ మహిళ దినచర్య ఇది. రోజూ ఇంతటి
సాహసం చేయడం వెనుక పెద్ద సంకల్పమే ఉంది. అభివృద్ధికి, ఆధునిక
సమాజానికి దూరంగా ఉండిపోయిన గిరిజన తండాలోని చిన్నారులకు విద్యా ఫలాలు అందించాలన్న
అభిలాషే.. ఆమెను ముళ్లబాటలో ముందుకు నడిపిస్తోంది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలోని
గిరిజన తండా అయిన అంబుమాలలో 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. 80 మంది జనాభా ఉండే ఈ తండాలో ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం
ఏర్పాటు చేసింది. కానీ.. పాఠాలు చెప్పాలంటే మాత్రం ఉపాధ్యాయులు అడవిలో కిలోమీటర్ల
దూరం నడవాల్సిందే. ఈ కష్టాన్ని భరించలేక గతంలో ఉన్న టీచర్ రాజీనామా చేశారు. విషయం
తెలుసుకున్న మినీ అనే మహిళ గిరిజన పిల్లలకు చదువు చెప్పేందుకు ముందుకొచ్చారు.
అధికారుల్ని అభ్యర్థించి.. అంబుమాల పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా తాత్కాలిక
ప్రాతిపదికన 2015 ఆగస్టులో నియమితులయ్యారు.
మినీది.. చలియార్ పంచాయతీ
పరిధిలోని వెండాతు పొయిల్. అంబుమాలకు, ఆమె ఇంటికి దూరం 8 కిలోమీటర్లు. రోడ్డు సదుపాయం ఏమీ ఉండదు. ఏ మాత్రం భయపడకుండా అడవి
మార్గంలో వెళ్తూ విధులకు హాజరవుతున్నారు. విద్యా బోధనకే పరిమితం కాకుండా.. అంబుమాల
వాసులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా మినీ మారారు.
గిరిజనులకు సొంత ఇళ్లు, విద్యుత్ కనెక్షన్లు వచ్చేలా
చూశారు. ఆధార్, రేషన్ కార్డుల జారీ, కరోనా
వ్యాక్సినేషన్ విషయంలో అండగా నిలుస్తున్నారు.
0 Komentar