TS: రెండో విడత 3,334 నియామకాలకు అనుమతి - యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు
వయోపరిమితి పెంపు
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3,334 ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖ ల్లోని 3,334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.
యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు
వయోపరిమితి పెంపు..
యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు పెంచింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వయోపరిమితి పెంపు అంశంపై చర్చించారు.
పోలీసు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖ, జైళ్లు,
రవాణా, అటవీశాఖ ఉద్యోగాలకు గరిష్ఠ వయసును
మూడేళ్లపాటు పొడిగించారు. వయోపరిమితి పెంపు ఇవాళ్టి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉండనుంది.
అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
0 Komentar