Haryana: Rakhigarhi dig in Hisar village
gives evidence of a planned Harappan-era city
హరియాణాలో హరప్పా యుగం నాటి అస్థిపంజరాలు - 5 వేల ఏళ్ల కిందటి మహిళలుగా గుర్తింపు
హరప్పా యుగం నాటి ప్రాచీన మానవ
ఆవాస స్థలమైన రాఖీగఢీలోని పురాతన శ్మశానవాటిక నుంచి వెలికితీసిన రెండు అస్థిపంజరాల
డీఎన్‌ఏ నమూనాలను అధికారులు శాస్త్రీయ పరీక్షలకు పంపారు. ఈ విశ్లేషణ ద్వారా కొన్ని
వేల సంవత్సరాల కిందట రాఖీగఢీ ప్రాంతంలో నివసించిన మన పూర్వీకుల గురించి, వారి
ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవచ్చు. దిల్లీకి 150
కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో భారత పురావస్తుశాఖ గుర్తించిన ఏడో నంబరు
మట్టిదిబ్బ వద్ద వేర్వేరు సమాధుల్లో రెండు అస్థిపంజరాలను తవ్వకాల్లో బయటకు తీశారు.
కటిభాగ నిర్మాణం ద్వారా వీరిని మహిళలుగా గుర్తించారు. చనిపోయేనాటికి వీరి వయసు 40 నుంచి 50 ఏళ్లు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇవి
దాదాపు 5 వేల ఏళ్ల కిందటివిగా భావిస్తున్నారు. హరప్పా
నాగరికత కాలం నాటి అంత్యక్రియల ఆచారాలకు అనుగుణంగా ఈ సమాధుల గుంతల్లో కుండ పెంకులు,
ఇతర ప్రాచీన కళాకృతులు లభించినట్లు పురావస్తుశాఖ అధికారులు
తెలిపారు.
-
హిసార్ జిల్లా పరిధిలోకి వచ్చే రాఖీగఢీ ప్రాంతంలోని రాఖీ
ఖాస్, రాఖీ షాపుర్ గ్రామాల్లో పురావస్తుశాఖ గుర్తించిన
మట్టిదిబ్బలు దాదాపు 350 హెక్టార్ల విస్తీర్ణంలో మొత్తం ఏడు
దాకా ఉన్నాయి. ప్రస్తుతం 1, 3, 7 మట్టిదిబ్బల వద్ద పరిశోధనలు
కొనసాగుతున్నాయి. ప్రాచీనకాలంలో ఈ ప్రాంతాన చక్కగా రూపుదిద్దుకొన్న పౌరజీవన
వసతులకు ఇవి తార్కాణం. రెండు నెలల కిందట తమ బృందం వెలికితీసిన అస్థిపంజరాల నుంచి
డీఎన్‌ఏ నమూనాలను నిపుణుల ద్వారా ఇటీవలే సేకరించినట్లు తవ్వకాల బృందానికి సారథ్యం
వహిస్తున్న భారత పురావస్తుశాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఎస్.కె.మంజుల్
తెలిపారు. ఈ నమూనాలకు మొదట లఖ్‌నవూలోని బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్‌లో
ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసి, తర్వాత ఫోరెన్సిక్
విశ్లేషణకు పంపుతామని వివరించారు.
డీఎన్‌ఏ పరీక్షలు
ఈ ప్రాచీన పట్టణంలో నివసించిన మన
పూర్వీకుల చరిత్ర తెలుసుకోవచ్చు. వారు (ఇద్దరు మహిళలు) స్థానికులా, మరో
ప్రాంతం నుంచి వలస వచ్చి స్థిరపడ్డారా అన్నది తేలుతుంది. పంటిభాగం నుంచి తీసిన
నమూనాలతో ఆ కాలం నాటి ఆహారపు అలవాట్లు తెలుస్తాయి. నమూనాల సేకరణలో అవి కలుషితం కాకుండా
అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
0 Komentar