Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2022: Gujarat Titans - First Season, First Title - IPL Creates Guinness World Record

 

IPL 2022: Gujarat Titans - First Season, First Title - IPL Creates Guinness World Record

ఐపీఎల్‌-2022 చాంపియన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ - తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచిన ఘనత

గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన ఐపీఎల్‌ 2022 


మెక్‌కాయ్‌ బౌలింగ్‌లో బంతిని డీప్‌స్క్వేర్‌ లెగ్‌ దిశగా శుబ్‌మన్‌ గిల్‌ సిక్సర్‌ బాదాడు...అంతే! ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్‌ మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు హాజరైన 1,04,859 మందితో మైదానమంతా హోరెత్తగా, గుజరాత్‌ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించి గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌–2022 విజేతగా నిలిచింది. 

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా,  ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 45 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  

సమష్టి వైఫల్యం...

ఫైనల్‌కు ముందు 824 పరుగులు... అద్భుత ప్రదర్శనతో బట్లర్‌ ఒంటిచేత్తో రాజస్తాన్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. తుది పోరులో కూడా అతను చెలరేగితేనే గెలిచే అవకాశాలు ఉండగా... బట్లర్‌ను కట్టడి చేయడంలో టైటాన్స్‌ సఫలమైంది. గత మ్యాచ్‌ వరకు 45 సిక్సర్లు కొట్టిన అతను ఈ మ్యాచ్‌లో ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేకపోగా, దాదాపు చివరి వరకు అతని స్ట్రయిక్‌రేట్‌ వంద పరుగులు దాటలేదు. గుజరాత్‌ పదునైన బౌలింగ్‌ ముందు ఇతర బ్యాటర్లు కూడా విఫలం కావడంతో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ పేలవంగా ముగిసింది. 

యశస్వి జైస్వాల్‌ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (10 బంతుల్లో 2) ఖాతా తెరిచేందుకే చెరో ఎనిమిది బంతులు తీసుకోగా... మధ్యలో వరుసగా 28 బంతుల పాటు బౌండరీ రాలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంలో విఫలమయ్యాడు. టీమ్‌లో ఉన్న మరో హిట్టర్‌ హెట్‌మైర్‌ (12 బంతుల్లో 11; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోవడంతో రాయల్స్‌ చేసేందుకు ఏమీ లేకపోయింది. 13వ ఓవర్‌ తొలి బంతికి బట్లర్‌ అవుట్‌ కావడంతో రాజస్తాన్‌ భారీ స్కోరు ఆశలు ముగిసిపోయాయి. 

ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సమస్యా రాలేదు. వృద్ధిమాన్‌ సాహా (7 బంతుల్లో 5; 1 ఫోర్‌), మాథ్యూ వేడ్‌ (10 బంతుల్లో 8; 1 సిక్స్‌) విఫలమైనా... గిల్, హార్దిక్‌ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. రాజస్తాన్‌ బౌలర్లు వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రశాంతంగా ఆడిన గిల్, హార్దిక్‌ మూడో వికెట్‌కు 53 బంతుల్లో 63 పరుగులు జోడించారు. హార్దిక్‌ను చహల్‌ అవుట్‌ చేసినా... లక్ష్యం మరీ చిన్నది కావడంతో గుజరాత్‌ సునాయాసంగా గెలుపువైపు దూసుకుపోయింది. శుబ్‌మన్‌ గిల్, డేవిడ్‌ మిల్లర్‌ నాలుగో వికెట్‌కు 29 బంతుల్లో 47 పరుగులు జోడించి విజయాన్ని అందించారు. 

స్కోరు వివరాలు

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) సాయికిషోర్‌ (బి) యశ్‌ 22; బట్లర్‌ (సి) సాహా (బి) హార్దిక్‌ 39; సామ్సన్‌ (సి) సాయికిషోర్‌ (బి) హార్దిక్‌ 14; పడిక్కల్‌ (సి) షమీ (బి) రషీద్‌ 2; హెట్‌మైర్‌ (సి అండ్‌ బి) హార్దిక్‌ 11; అశ్విన్‌ (సి) మిల్లర్‌ (బి) సాయికిషోర్‌ 6; పరాగ్‌ (బి) షమీ 15; బౌల్ట్‌ (సి) తెవాటియా (బి) సాయికిషోర్‌ 11; మెక్‌కాయ్‌ (రనౌట్‌) 8; ప్రసిధ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 130.

వికెట్ల పతనం: 1–31, 2–60, 3–79, 4–79, 5–94, 6–98, 7–112, 8–130, 9–130.

బౌలింగ్‌: షమీ 4–0–33–1, యశ్‌ దయాళ్‌ 3–0–18–1, ఫెర్గూసన్‌ 3–0–22–0, రషీద్‌ ఖాన్‌ 4–0–18–1, హార్దిక్‌ పాండ్యా 4–0–17–3, సాయికిషోర్‌ 2–0–20–2.  

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) ప్రసిధ్‌ 5; గిల్‌ (నాటౌట్‌) 45; వేడ్‌ (సి) పరాగ్‌ (బి) బౌల్ట్‌ 8; హార్దిక్‌ (సి) యశస్వి (బి) చహల్‌ 34; మిల్లర్‌ (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 133.

వికెట్ల పతనం: 1–9, 2–23, 3–86,

బౌలింగ్‌: బౌల్ట్‌ 4–1–14–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–40–1, చహల్‌ 4–0–20–1, మెక్‌కాయ్‌ 3.1–0–26–0, అశ్విన్‌ 3–0–32–0.

ఐపీఎల్‌ చరిత్రలో యజ్వేంద్ర చహల్‌ రికార్డు

రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎ్‌ సీజన్‌లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ పోరులో హార్దిక్‌ పాండ్యాను ఔట్‌ చేయడం ద్వారా ఈ సీజన్‌లో చహల్‌ 27వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సూపర్‌ ఫామ్‌తో దూసుకెళ్తున్న చహల్‌ ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 7.75 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 

తద్వారా ఇమ్రాన్‌ తాహిర్‌(26 వికెట్లు) రికార్డును బ్రేక్‌ చేసిన చహల్‌ తొలి స్థానానికి దూసుకెళ్లాడు. ఇంతకముందు 2019లో ఇమ్రాన్‌ తాహిర్‌ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్‌ వనిందు హసరంగా కూడా 26 వికెట్లతో తాహిర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. సునీల్‌ నరైన్‌ 2012లో కేకేఆర్‌ తరపున స్పిన్నర్‌గా 24 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉండగా.. 2013లో ముంబై ఇండియన్స్‌ తరపున హర్భజన్‌ 24 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

IPL 2022: గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన ఐపీఎల్‌

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని ఐపీఎల్‌ నిర్వహకులు రూపొందించారు. తద్వారా ఐపీఎల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌-2022 ఫైనల్‌ జరగుతున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జెర్సీని ఆవిష్కరించారు. ఈ జెర్సీపై ఐపీఎల్‌ 15లో ఆడుతున్న 10 జట్ల లోగోలు ఉన్నాయి.

ఈ జెర్సీ 66 మీటర్ల పొడవుతో పాటు 42 మీటర్ల వెడల్పు ఉంది. ఇక ఈ జెర్సీకి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్‌-2022 ముగింపు వేడుకులు అంబరాన్ని అంటాయి. ముగింపు కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తమ ప్రదర్శనలతో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags