National Insurance Awareness Day 2022: Know
the Significance Details Here
జాతీయ బీమా
అవగాహన దినోత్సవం 2022: ప్రాముఖ్యత మరియు తెలుసుకోవాల్సిన ప్రాథమిక
విషయాలు ఇవే
బీమా అనేది
కొత్త పదం ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే అయినా.. ప్రజలలో మాత్రం దీని గురించి
అవగాహన తక్కువ. అయితే, కోవిడ్ కారణంగా
నెలకున్న అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణం
కారణంగా పెరుగుతున్న ఖర్చులు బీమా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నాయి. దీంతో
చాలా మంది బీమా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బీమాలో జీవిత, ఆరోగ్య, వాహన, గృహ.. ఇలా అనేక రకాల బీమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం
తీసుకున్న బీమా ఏదైనా.. జీవితంలో జరిగే అనుకోని సంఘటనల కారణంగా ఏర్పడే ఆర్థిక
విపత్తుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అందువల్ల, సంపాదించే ప్రతీ వ్యక్తి తమ అవసరాలకు అనుగుణంగా బీమాను కొనుగోలు చేయాలి. నేడు
(జూన్ 28)
జాతీయ బీమా అవగాహన దినోత్సవం సందర్భంగా బీమా కొనుగోలు
నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాథమిక విషయాల గురించి
చర్చించుకుందాం.
1. సరైన ఎంపిక..
బీమా అనేది
అందరికీ అవసరమే అయినా.. అన్ని అవసరాలకు ఒకటే పాలసీ అందుబాటులో ఉండదు. వేరు వేరు
అవసరాలకు వేరు వేరు పాలసీలు అందుబాటులో ఉంటాయి. వ్యక్తులు వారి వారి అవసరాలకు
అనుగుణంగా సరైన పాలసీని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతీ ఒక్కరి ఆర్థిక
ప్రణాళికలో జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు
భాగం కావాలి.
* జీవిత బీమాలో
తక్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ మొత్తాన్ని అందించే పాలసీ.. టర్మ్ బీమా. ఇది మరణ
ప్రయోజనాన్ని మాత్రమే అందిస్తుంది. అంటే మరణించిన తర్వాత కూడా తమపై ఆధారపడిన
కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనుకునే వారికి ఈ పాలసీ సరైన ఎంపిక.
* రెండవది
సమగ్ర ఆరోగ్య బీమా.. ప్రస్తుతం ద్రవ్యోల్బణ ప్రభావంతో వైద్యానికి, శస్త్ర చికిత్సలకు చాలానే ఖర్చవుతుంది. అత్యవసరంగా చికిత్స
అవసరమయితే అప్పటికప్పుడు డబ్బు సమకూర్చుకోవడం సామాన్యుడికి చాలా కష్టమైన పని.
అందవల్ల ప్రతీ ఒక్కరూ సమగ్ర ఆరోగ్య బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికి
ప్రాణాంతక వ్యాధులను కవర్ చేసే క్రిటికల్ ఇల్ నెస్ పాలసీని జోడించడం మంచిది.
* సమగ్ర వాహన
బీమా.. భారత్ లో రోడ్డు పై తిరిగే ప్రతి మోటారు వాహనానికి 'థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్' ఉండడం తప్పనిసరి. అయితే, ఇది మాత్రమే
సరిపోదని,
సమగ్ర బీమా ఉండడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. థర్డ్
పార్టీ బీమాలో కేవలం ఎదుటి వ్యక్తులు, వాహనాలు, ఆస్తుల కు మన వల్ల సంభవించిన ప్రమాదాలకు బీమా రక్షణ
ఉంటుంది. కానీ మీ వాహనానికి ఎలాంటి బీమా కవరేజీ ఉండదు. సమగ్ర వాహన బీమా, పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్ల వల్ల జరిగే నష్టాన్ని మాత్రమే కాకుండా వాహనం
చోరీకి గురైనా కవర్ చేస్తుంది.
ఇవి కాకుండా
గృహ బీమా,
ప్రయాణ బీమా, ప్రమాద బీమా, సైబర్ బీమా.. ఇలా వివిధ రకాలు పాలసీలు అందుబాటులో ఉంటాయి.
అవసరాన్ని బట్టి కావాల్సిన పాలసీని ఎంచుకోవచ్చు.
2. కవరేజ్..
కవరేజ్ ఎంత
ఉండాలి అనేది వారి వారి వ్యక్తిగత జీవితంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల జీవన శైలి, ఖర్చులు.. ఇలా వేరు వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఎవరి జీవిన విధానానికి తగినట్లు వారు కవరేజ్ ను ఎంచుకోవాలి.
టర్మ్ జీవిత బీమాను తీసుకుంటే.. ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయానికి కనీసం 12-15 రెట్లు అధికంగా హామీ మొత్తం ఉండేలా చూసుకోవాలి. ఇక ఆరోగ్య
బీమా విషయానికి వస్తే.. కుటుంబంలో ఉన్న సభ్యులు, వారి వైద్య చరిత్ర ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఆసుప్రతిలో
ఉండాల్సి వస్తే కనీసం 3 నుంచి 5 రోజుల సగటు ఆసుపత్రి బిల్లును అంచనా వేసి తదనుగుణంగా కవరేజ్
ఉండేలా చేసుకోవాలి.
3. ప్రీమియం..
ఒక వ్యక్తి
తన ఆదాయం , (మతకి తగినట్లు.. పొదుపు చేయగలుగుతాడు.
అందువల్ల బడ్జెట్‌కు అనుగుణంగా సరైన కవరేజ్ ప్రయోజనాలను అందించే పాలసీలను
ఎంచుకోవాలి. అలాగని పాలసీ ఎంపికలో ప్రీమియం ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు. మనం
ఖర్చు చేసే ప్రతీ రూపాయికి విలువనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యం.
4. ఫ్యామిలీ కవరేజ్..
ఇది ముఖ్యంగా
ఆరోగ్య బీమాకు అనుబంధంగా ఉండే అంశం. కుటుంబంలోని ఏ ఒక్కరి ఆరోగ్యం సరిగ్గా లేక
చికిత్స కోసం ఆసుప్రతిలో చేరాల్సి వచ్చినా.. యజమాని జేబు ఖాళీ అవుతుంది. అందువల్ల
సంపాదించే వ్యక్తి తనతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా తీసుకోవడం అవసరం.
ఇందుకోసం ఫ్యామిలీ ఫోటర్ పాలసీని ఎంచుకోవడం మేలు. ఇది కుటుంబంలోని అందరి
వ్యక్తులను కవర్ చేస్తుంది. కుటుంబంలో పెద్ద వయసు ఉన్న వ్యక్తి ఆధారంగా ప్రీమియం
ఉంటుంది కాబట్టి కుటుంబంలో సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి విడిగా ఆరోగ్య బీమాను తీసుకోవడం
మంచిది.
5. యాడ్-ఆన్లు..
బీమా సంస్థలు
మీరు ఎంచుకున్న (జీవిత, ఆరోగ్య, వాహన, గృహ.. మొదలైన)
పాలసీతో కొన్ని యాడ్ ఆన్లు లేదా రైడర్లను ఆఫర్ చేస్తుంటాయి. మీకు అవసరమైన రైడర్లను
చేర్చడం వల్ల మరింత కవరేజ్ పెంచుకోవచ్చు ఉదాహరణకి, ప్రీమియం వేవర్, యాక్సిడెంటల్ డెత్
రైడర్,
క్రిటికల్ ఇల్ నెస్ రైడర్, పార్షియల్ అండ్ పర్మినెంట్ డిసేబిలిటీ రైడర్, ఇన్ కమ్ బెనిఫిట్ రైడర్ వంటి రైడర్లను మీ అవసరానికి అనుగుణంగా పాలసీకి
జతచేయవచ్చు. అలాగే, వాహన బీమా విషయంలో
జీరో డిప్రిసియేషన్ రైడర్ ను జత చేయడం వల్ల అధిక కవరేజ్ ప్రయోజనాలను పొందవచ్చు.
6. నో-క్లెయిమ్ బోనస్..
సాధారణంగా
ఆరోగ్య,
మోటారు బీమా పాలసీల్లో క్లెయిమ్ చేయని సంవత్సరానికి నో-
క్లెయిమ్ బోనసను అందిస్తారు. చిన్న చిన్న వాటికి బీమా క్లెయిమ్ చేయకుండా ఉంటే
తదుపరి ప్రీమియంను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
7. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో..
జీవిత, ఆరోగ్య, వాహన బీమా.. ఇలా
తీసుకునే పాలసీ ఏదైనా.. బీమా సంస్థను ఎంచుకునే ముందు చెక్ చేయాల్సిన ముఖ్యమైన అంశం
ఇది. ఒక సంవత్సరంలో బీమా సంస్థ మొత్తంగా ఎన్ని క్లెయిమ్ లను స్వీకరించింది? అందులో ఎన్ని పరిష్కరించింది? ఎంత మొత్తాన్ని క్లెయిమ్ ల కోసం చెల్లించింది? బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో ఎంత? తదితర సమాచారాన్ని తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఐఆర్ డీఏఐ వార్షిక
నివేదికలను విడుదల చేస్తుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 90 శాతం కంటే ఎక్కువ ఉన్న సంస్థలను మాత్రమే పాలసీదారుడు ఎంపిక
చేసుకోవడం మంచిది.
8. పన్ను నియమాలు..
ఆదాయపు చట్టం
1961 ప్రకారం జీవిత, ఆరోగ్య బీమా
పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై వివిధ సెక్షన్ల కింద మినహాయింపు ప్రయోజనాలు
లభిస్తాయి. పాలసీ తీసుకునే ముందు వీటిని తెలుసుకోవడం మంచిది.
గమనిక: ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి. కొనుగోలు చేసే ముందు వివిధ బీమా సంస్థలు అందిస్తున్న పాలసీలు, వాటి ఫీచర్లు, ప్రయోజనాలు, ప్రీమియం మొదలైన అంశాలను ఆన్లైన్లో పోల్చి చూసి సరైన పాలసీని కొనుగోలు చేయడం మంచిది. పాలసీ ఏదైనా.. పూర్తి ప్రయోజనాలను పొందాలంటే సమయానికి ప్రీమియం చెల్లించడం, సకాలంలో పునురుద్ధరించడం ముఖ్యమని గుర్తుంచుకోండి.
===================
APY: అటల్ పెన్షన్ యోజన – పూర్తి వివరాలు ఇవే
PMSBY: ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన – పూర్తి వివరాలు ఇవే
PMJJBY: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన – పూర్తి వివరాలు ఇవే
===================
0 Komentar