Euro And Dollar Are Equal for First Time
In 20 Years
డాలర్ విలువ 20 ఏళ్ల తర్వాత యూరోతో సమానంగా మారింది – తెలుసుకోవలసిన విషయాలు
ఇవే
అంతర్జాతీయ
మార్కెట్లో 2002 తర్వాత యూరో, డాలర్ సమానంగా మారాయి. మదుపర్లు యూరోజోన్ నుంచి
పెట్టుబడులను ఉపసంహరించుకొని అమెరికాకు మళ్లిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.
యూరో ఎందుకు
బలహీనపడుతోంది..
నిజానికి 2008 నుంచి యూరో పతనం ప్రారంభమైంది. 2021 తర్వాత అది మరింత ఊపందుకొంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
కారణంగా ఐరోపా దేశాల్లో తలెత్తిన ఇంధన సంక్షోభం దానికి మరింత ఆజ్యం పోసింది.
డాలరుతో పోలిస్తే యూరో బలహీనతకు రెండు కారణాలున్నాయి. యూరోజోన్ దేశాల ఆర్థిక
వ్యవస్థ బలహీనపడటం ఒకటైతే.. అమెరికాతో పోలిస్తే యూరోజోన్ పరపతి విధానాల్లో
వ్యత్యాసం మరొకటి.
కొవిడ్
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా దేశాలు తీసుకున్న చర్యలు పటిష్ఠంగా లేకపోవడంతో
అమెరికాతో పోలిస్తే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా మారాయి. దీంతో ద్రవ్యోల్బణం
చారిత్రక గరిష్టాలకు చేరింది. సరిగ్గా ఇదే సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం
మొదలైంది. ఐరోపా దేశాలు ఇంధనం కోసం పూర్తిగా రష్యాపై ఆధారపడ్డాయి. కానీ, ఆంక్షల కారణంగా సరఫరా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. ఇది
సామాన్యులకు భారంగా మారడంతో పాటు మదుపర్లకు తమ పెట్టుబడుల భవిష్యత్తుపై సందేహాలకు
కారణమైంది.
రష్యాపై
ఆంక్షల కారణంగా ఐరోపా దేశాలు వివిధ రకాల ఉత్పత్తుల దిగుమతుల కోసం ఇతర దేశాలను
ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు
ఎగబాకాయి. ఫలితంగా యూరోజోన్ దేశాల దిగుమతుల బిల్లు గణనీయంగా పెరిగింది. ఐరోపాలో
అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో 1991 తర్వాత మే నెలలో తొలిసారి వాణిజ్యలోటు నమోదైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన
నిల్వల్లో స్వయంసమృద్ధి సాధించిన అమెరికాకు పెట్టుబడులు బదిలీ అవుతున్నాయి.
అమెరికాలోనూ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఏమీ లేవు. త్వరలో ఆర్థిక మాంద్యం
రావొచ్చన్న బలమైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ, యూరోజోన్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు
అమెరికాకు తరలిపోతున్నాయి.
ఇక రెండో
విషయానికి వస్తే.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానం. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి
తీసుకొచ్చేందుకు అక్కడి ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతోంది. ఆర్థిక మందగమనం
వచ్చినా.. ధరల పెరుగుదలకు అడ్డుకట్టపడే వరకు వెనక్కి తగ్గేది లేదన్నట్లు ముందుకు
సాగుతోంది. మరోవైపు ఈసీబీ మాత్రం రేట్ల పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
కొవిడ్ నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు రేట్ల పెంపు విఘాతం కలిగించే
అవకాశం ఉందని ఈసీబీ అభిప్రాయపడుతోంది. దీంతో అమెరికాలో రాబడులు ఆకర్షణీయంగా
మారడంతో పెట్టుబడిదారులు అటువైపు మళ్లారు. ఇది పరోక్షంగా యూరో బలహీనతకు కారణమైంది.
రూపాయిపై
ప్రభావం ఎంత?
యూరోతో
పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతానికి పెరిగింది. దీనివల్ల ఐరోపాలో ఉన్న
భారతీయులు స్వదేశానికి రావడానికి ఖర్చు తగ్గుతుంది. కానీ, దీర్ఘకాలంలో మాత్రం యూరో పతనం వల్ల రూపాయి కూడా
బలహీనపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ సహా వర్ధమాన దేశాలు డాలరు
తర్వాత
యూరోల్లోనే
వాణిజ్యాన్ని కొనసాగిస్తుండడమే దీనికి కారణం. అయితే, యూరో ఆధారిత రుణాలు తీసుకున్న కంపెనీలకు మాత్రం ఇది కలిసిరానుంది. ఎందుకంటే
రుణ,
వడ్డీ చెల్లింపులకు తక్కువ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.
0 Komentar