HOLY FESTIVAL OF SACRIFICE - పవిత్ర త్యాగాల పండుగ బక్రీద్
బక్రీద్
పండుగ గురించి తెలుసుకుందాం
నిజానికి
‘బక్రీద్’ పండుగ అసలు పేరు- ‘ ఈదుల్ - అద్ హా’ అంటే – “త్యాగాల పండుగ (Festival of sacrifice)”
దీనికి రెండు నెలల ముందు వచ్చే మరొక పండుగ “రంజాన్” దీని అసలు పేరు “ఈదుల్ ఫిత్ర్” అంటే- “దానాల పండుగ (Festival of charity)”.
ఈ విధంగా
ఇస్లాం నిర్దేశించే రెండు పండుగల్లో
మొదటిది-
“దానాలు (Charity)” విస్తృతంగా చేస్తూ
నిర్వహించుకునే పండుగ రమజాన్ అయితే...
రెండవది “త్యాగం (Sacrifice)” చేస్తూ నిర్వహించుకునే మరొక పండుగ బక్రీద్.
ఈ రెండు
పండుగలు తప్ప ముస్లిం సమాజంలో కొందరు జరుపుకునే పండుగలకు ఇస్లాంతో ఏమాత్రం సంబంధం
లేదన్న విషయాన్ని గమనించాలి.
“త్యాగాల
పండుగ” ఈ పదం వినటానికి, చదవటానికి చాలా
ఆశ్చర్యంగా ఉంది కదూ! ఎందుకంటే “పండుగ” అంటే ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, రుచికరమైన ఆహారాలు వండుకు తింటూ సంతోషంగా గడపటం అన్నదే
అందరికీ తెలిసింది.
కానీ, ఇస్లాం దీనికి పూర్తి భిన్నంగా మీ ఇంటిల్లిపాదీ జరుపుకునే
పండుగలో అగత్యపరులు, అవసరార్ధులు, బీదలను, మీ దగ్గరి బంధువులను, మీ ఇరుగుపొరుగువారిని కూడా మీ సంతోషంలో భాగస్వాములుగా
చేసుకుని,
వారికి మీకు కలిగి ఉన్నంతలో దానమిచ్చి, మీరు తినే దానిలో వారిని కూడా భాగస్వాములుగా చేసుకుని పండుగ
చేసుకోవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది.
అందుకే ప్రతీ వ్యక్తి ప్రవృత్తిలో “దాన గుణాన్ని” “త్యాగనిరతిని” పెంపొందించటానికి ఒక పండుగను “దానాల పండుగ (Festival of charity)” అని.. మరొక పండుగను “త్యాగాల పండుగ (Festival of sacrifice)” అని నిర్దేశించటం జరిగింది.
ఏమిటీ త్యాగాల పండుగ (Festival of sacrifice)?
సంక్షిప్తంగా
ప్రవక్త ఇబ్రాహీం (అలై) దైవ మార్గంలో చేసిన బలికి గుర్తు (Symbol) గా దైవ మార్గంలో ఒక గొర్రెనో, మేకనో, జిబా చేయదగిన జంతువును బలి
ఇవ్వాల్సిందిగా నిర్దేశించటం జరిగింది. దానికి కారణం పై జంతువులలో వేటినో ఒక
దానిని బలిచ్చి ఎవరికి వారు వండుకు తినటానికి కాదు. అసలు కారణం- ఆ బలి ఇవ్వగా వచ్చిన
మాంసంలో మూడు భాగాలు చేసి ఒక భాగం బీదలకు పంచాలి తద్వారా ఎందరో ఆకలితో అలమటించే
బీదలకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. మరొక భాగం బంధువులు దగ్గరవారు
ఇరుగుపొరుగు వారికి దానం చేసి మిగిలిన ఒక భాగం స్వయంగా తినటం కోసం అన్న ఉద్దేశంతో
మాత్రమే!
ఈ విధంగా సమాజంలో బీదలు, బంధువులు, ఇరుగుపొరుగు వారికీ జంతువును బలి ఇచ్చిన జంతు మాంసం నుండి మూడొంతుల్లో రెండొంతులు ఇవ్వటం అన్న ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తిలో త్యాగనిరతిని, దాన గుణాన్ని పెంపొందించటం అన్నది వాస్తవానికి ఈ బక్రీద్ పండుగను నిర్దేశించటం వెనుక ఉన్న అసలు మౌలిక లక్ష్యం.
అసలు బలి
ఇవ్వాల్సినవి ఏమిటి?
ధర్మంలో ప్రార్ధన, ఉపవాసం, జంతు బలి ఇవ్వటం వగైరా క్రతువులు ఏదో పుణ్యం కోసం యాంత్రికంగా చేసుకుపోవటానికి నిర్ధేశించినవి కావు. కానీ, వాటి నిర్వర్తించటం ద్వారా ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించి.. మంచిపనులు చేసే ప్రవృత్తిని జనింపజేయటమే!
ధర్మంలో సదాచారణ
“గమ్యం” అయితే క్రతువులన్నీ “గమనాలు” అవుతాయి అంటే గమ్యాన్ని చేర్చే సాధనాలన్న
మాట. దైవమార్గంలో ఒక వ్యక్తి చేసే ఆరాధనలైనా, బలిదానాలైనా
స్వీకరించబడాలంటే.. ముందు అతని సదాచారణ బాగుండాలి. అదే లేనప్పుడు ఎన్ని ఆరాధనలు
చేసినా ఎన్ని బలిదానాలిచ్చినా.. మరెన్ని క్రతువులు నిర్వర్తించినా అవన్నీ బూడిదలో
పోసిన పన్నీరే అవుతాయి.
ఇక బక్రీద్
రోజున దైవ మార్గంలో ఒక వ్యక్తి జంతు ‘బలి దానం’ ఇవ్వటం అన్న క్రతువుతో “ఖుర్బానీ
(త్యాగం)” అన్న ప్రక్రియ పూర్తి అయిపోదు. నిజానికి ఒక వ్యక్తి చెయ్యవలసిన
“ఖుర్బానీలు (త్యాగాలు)” ఏమిటో ఈ క్రింది ఖురాన్ వాక్యంలో చదవగలరు.
“మీరు అమితంగా
ప్రేమించే వస్తువులను (దైవ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకూ మీరు సత్కార్య స్థాయికి
చేరుకోలేరు” - 3:92
అమితంగా
ప్రేమించే వాటిని త్యాగం చెయ్యటం? అంటే మనిషి...
అమితంగా ప్రేమించే ధనాన్ని త్యాగం చెయ్యగలగాలి...
అమితంగా ప్రేమించే
వస్తువులను త్యాగం చెయ్యగలగాలి...
అమితంగా
ఇష్టపడే ఆహార పదార్థాలను త్యాగం చెయ్యగలగాలి...
ఈ విధంగా
మనిషి అమితంగా ప్రేమించే పై వాటిని త్యాగం చెయ్యటంతో పాటు మనిషి..
ఇతరుల పట్ల
ఉండే ఈర్ష్యా-ధ్వేషాలను బలి ఇవ్వాలి...
వదులుకోలేని
బలహీనతలను బలి ఇవ్వాలి...
చెడు కోరికలను, చెడు ఆలోచనలను బలి ఇవ్వాలి...
కాబట్టి
బక్రీద్ రోజు జంతు బలి ఇవ్వటం అన్నది ఒక కేవలం ప్రవక్త ఇబ్రహీం (అలై) బలికి ఒక 'గుర్తు (Symbol)' గా నిర్వర్తించే
క్రతువు అయినప్పటికీ..
దైవ మార్గంలో
అమితంగా ప్రేమించే వాటిని అంటే- మనిషి అమితంగా ప్రేమించే ధనాన్ని, ఆహార పదార్థాలను, వస్తువులను
త్యాగం చెయ్యగలగాలి..
దానితో పాటు
ఈర్ష్యా-ధ్వేషాలను, బలహీనతలను, చెడు కోరికలను బలివ్వాలి. ఈ రకమైన త్యాగనిరతిని
వ్యక్తిత్వంలో కలిగి ఉన్నప్పుడే ఖుర్బానీ ఇవ్వటం అన్న ప్రక్రియకు సార్థకత
చేకూరుతుంది.
ఒకవేళ నేడు
ముస్లిం సమాజంలో బక్రీద్ ను పురస్కరించుకుని ఎందరో ఎన్నెన్నో బలిదానాలు ఇస్తున్నప్పటికీ..
ఖురాన్ ఆశిస్తున్నంత స్థాయి వ్యక్తిత్వ నిర్మాణం చాలా మందిలో అభివృద్ధి చెందటం
లేదంటే.. అర్థం చేసుకోవలసింది చాలా మంది బలి (ఖుర్బానీ) అన్న క్రతువును ఏదో పుణ్యం
కొద్దీ సెంటిమెంటుగా నిర్వర్తిస్తున్నారే తప్ప ఆ జంతు బలితో పాటు అసలు బలి
ఇవ్వవలసిన వాటిని బలివ్వటం లేదనే అర్థం.
కాబట్టి
దైవమార్గంలో ఇచ్చే జంతు బలి (ఖుర్బానీ) అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని బక్రీద్
పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ...
అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
0 Komentar