ప్రముఖ నటుడు
'రెబల్ స్టార్’ కృష్ణంరాజు
ఇక లేరు
ప్రముఖ నటుడు
కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస
విడిచారు.
1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో
కృష్ణంరాజు జన్మించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.
హీరోగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ విలన్ గానూ అలరించారు. 1966లో 'చిలకా గోరింకా' చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేశారు. 'అవేకళ్లు' చిత్రంలో
ప్రతినాయకుడిగానూ నిరూపించుకున్నారు. 1977,1984 సంవత్సరాల్లో నంది అవార్డులు గెలుచుకున్నారు.
1986లో 'తాండ్ర పాపారాయుడు' చిత్రానికి
ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి
పెట్టాయి. విజయనగర సామ్రాజ్య క్షత్రియ రాజ వంశానికి చెందిన కృష్ణంరాజు... దివంగత
మాజీ ప్రధాని వాజ్ పేయీ హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు.
కృష్ణంరాజుకు
భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు.
ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రముఖ నటుడు ప్రభాస్. చేసిన
పాత్రలతోనే.. రెబల్ స్టార్ గా.. కృష్ణంరాజు చేసిన పాత్రలే ఆయనకి 'రెబల్ స్టార్’ అనే
పేరు తీసుకొచ్చాయి. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ప్రయాణం సాహసోపేతంగా సాగింది.
భిన్నమైన పాత్రలతో నటుడిగా.. పరిశ్రమ స్థాయిని పెంచే చిత్రాలతో నిర్మాతగా ఆయన
ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు. అలనాటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు దీటుగా
తనదైన నటనతో రాణించిన కథానాయకుడు కృష్ణంరాజు.
0 Komentar