Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

James Cameron – Great Hollywood Director – Know the Interesting Facts about Him

 

James Cameron – Great Hollywood Director – Know the Interesting Facts about Him

జేమ్స్ కామెరాన్ - హాలీవుడ్ దర్శక దిగ్గజం గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు ఇవే

=====================

టెర్మినేటర్, టైటానిక్ మరియు అవతార్ సిరీస్ లాంటి చరిత్రాత్మక బ్లాక్ బ్లస్టర్లను అందించిన జేమ్స్ కామెరూన్  గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

బాల్యం

కామెరూన్ పుట్టి పెరిగింది కెనడాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో. తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. చదువంటే ఆసక్తిలేని కామెరూన్ కి చిన్నతనంలో ఫిజిక్స్, ల్యాబ్లో ప్రయోగాలు తెగ నచ్చేవి. అందుకోసమే స్కూల్ కి వెళ్లేవాడు. అంతేకాదు, తల్లి కథలు బాగా చెప్పేది. ఆమె ద్వారానే పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డ కామెరూన్ కి  క్రమంగా సైన్స్ ఫిక్షన్ కథల మీద ఆసక్తి పెరిగింది.

చదువు

కామెరూన్ ని  బాగా చదివించి తనలానే ఇంజినీర్ చేయాలనుకున్నాడు తండ్రి. హైస్కూల్ చదువయ్యాక స్థోమతకు మించి ఓ మంచి కాలేజీలో చేర్పించాడు. కానీ చదువు, ఉద్యోగం పట్ల ఆసక్తి లేక మధ్యలోనే మానేశాడు. అలాగని, తల్లిదండ్రులకు భారం కాకుండా ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. కామెరూన్ తల్లికి మాత్రం కొడుకు డ్రైవర్ గా  పనిచేయడం నచ్చేది కాదు. ఆ పని కాకుండా వేరే ఏదైనా చేయమని బతిమాలేది. 'నచ్చిన పని చేయడంలోనే ఆనందం' అంటూ కామెరూన్ డ్రైవర్ గానే చేసేవాడు.

మలుపు...

ఖాళీ సమయాల్లో కవితలూ, కథలూ రాసుకునేవాడు కామెరూన్. తనకి ఏదైనా రాయాలనిపిస్తే ట్రక్ ను  పక్కకు ఆపేసి రాసుకునేవాడు. మిగతా డ్రైవర్లు ఆయన్ని విచిత్రంగా చూసేవారు. అయితే 1977లో 'స్టార్ వార్స్' ఫ్రాంచైజీ సినిమాలు చూశాక కామెరూన్ కి  అలాంటి సినిమాలు తీయాలనిపించింది. లక్ష్యం పట్ల ఓ స్పష్టత తెచ్చుకుని, అసిస్టెంట్ డైరెక్టర్ గా  పని చేయాలనుకున్నాడు.

సినిమా ల్లో అవకాశాలు ...

హాలీవుడ్ లో  దాదాపు రెండేళ్లపాటు ప్రయత్నాలు చేసిన కామెరూని కి ఓ ప్రొడక్షన్ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది. కొన్నాళ్లు అక్కడ సినిమా పనులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ గానూ  చేసేవాడు. అయితే అనుకోకుండా ఆ ప్రొడక్షన్ వాళ్లు తీసే 'పిల్హనా' అనే సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. కానీ పదిరోజులపాటు ఆ సినిమాకోసం పనిచేసిన కామెరూన్కి దర్శకత్వం చేసే సామర్థ్యం లేదంటూ నిర్మాతలు మరొకరికి ఆ అవకాశం ఇచ్చారు.

మొదటి దర్శకత్వం ..

కామెరూన్ కోపంతో ఆ సంస్థను వదల్లేదు. ఆ సినిమాను ఎలా తీస్తున్నారో అక్కడే ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఉండి గమనించాడు. అనుకోకుండా నిర్మాతలు 'పిరన్హా2'కీ ప్లాన్ చేశారు. ముందే అనుకున్న దర్శకుడు కొంత కాలానికి ఆ సినిమా చేయనని చెప్పడంతో నిర్మాణ సంస్థ 'నువ్వేంటో నిరూపించుకో' అంటూ కామెరూనికి ఆ బాధ్యత అప్పగించింది. దాంతో ప్రాణం పెట్టి తీశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇతర నిర్మాణ సంస్థలూ కామెరూన్ ని  నమ్మడం మొదలు పెట్టాయి.

టెర్మినేటర్ కథ - కల

'పిరన్హా' షూటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి ఫుడ్ పాయిజన్ అయితే కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నాడు. సమయంలో ఒకరోజు ఇన్విజిబుల్ రోబో ఒకటి తనపైన దాడి చేసినట్టు పీడకల వచ్చింది. దిగ్గున లేచి కలను గుర్తు తెచ్చుకున్న కామెరూన్ రోబో కథాంశంతో కథ రాసుకుని, సినిమా తీశాడు. అదే 'ది టెర్మినేటర్... ఆ హిట్ కామెరూన్ జీవితాన్నే మార్చేసింది. దిగ్గజ దర్శకుల్లో ఒకడిగా నిలిపింది.

టైటానిక్ 

ఈత, వాటర్ స్పోర్ట్స్, సాహసాలంటే కామెరూన్ కు  చాలా ఇష్టం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం  కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసేవాడు. అవి తీస్తున్నప్పుడే 'టైటానిక్' తీయాలనే ఆలోచన వచ్చింది. షూటింగ్ కి ముందు టైటానిక్ షిప్పును చూడ్డానికి అట్లాంటిక్ మహా సముద్రం దిగువకు అనేక సార్లు డైవ్ చేశాడు. షిప్పును చూస్తూనే డైలాగులు కూడా ఆలోచించుకునేవాడట కామెరూన్.


షూటింగ్ సమయం లో ...

ఇక, పనిపట్ల నిబద్దత, రాజీ పడని ధోరణి వల్ల కామెరూన్ షూటింగ్ లో  నటీనటుల పట్ల దూకుడుగా వ్యవహరించేవాడు. దాంతో చాలామంది నటీనటులు కామెరూన్ తో  రెండోసారి నటించడానికి ఇష్టపడేవారు కాదట. 'టైటానిక్'లో హీరోయిన్ గా చేసిన కేట్ విన్సెట్ అదే మాట ఆయన ముఖాన్నే చెప్పేసిందట. చాలాసార్లు సినిమా అవకాశమిచ్చినా ఒప్పుకోలేదట. 'అవతార్' విడుదల తరవాత ఆమె తన అభిప్రాయం మార్చుకుని సీక్వెల్లో పనిచేయడానికి ఒప్పుకొందట.

'టైటానిక్' విడుదలకు ముందు వరకూ కామెరూన్ కి సినిమాలే ప్రపంచం. తాను తీసిన సినిమానే తన జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది అంటుంటాడు. 'టైటానిక్' సినిమాను ప్రేక్షకుడిగా చూశాక మనుషులూ, జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నా' అనే కామెరూన్ అప్పటివరకూ కోపంగా అందరిపై అరిచే ధోరణిని మార్చుకుని కూల్ పర్సన్ మారిపోయాడు. అంతేకాదు, సినిమాల నుంచి కాస్తదూరం జరిగి కొన్నాళ్లు కేవలం సముద్రాల్లో ఈదడాన్నే పనిగా పెట్టుకున్నాడు. దాదాపు మూడు గంటలపాటు సముద్రంలో గడిపి ఓ రికార్డును కూడా సృష్టించాడు.

అవతార్ ఆలోచన

1999లోనే 'అవతార్' కథలు సిద్ధం చేసుకున్నాడు. డబ్బులూ, టెక్నాలజీ పరంగా ఇబ్బందులు తలెత్తడంతో కాస్త విరామం తీసుకున్నాడు. అంతేకాదు, చాలా ప్రొడక్షన్ హౌస్ కి 'అవతార్' కథ నచ్చినా సినిమా తీయడం సాధ్యం కాదనేవారట. దాంతో కామెరూన్ కొన్ని ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసే సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 'అవతార్' తీసి తానేంటో ప్రపంచానికి మరోసారి చూపించాడు. కారులో లాంగ్ డ్రైవ్లకు వెళ్లడానికి ఇష్టపడే కామెరూన్ ఆ కథకోసం సంభాషణలు కారులో కూర్చునే రాసుకున్నాడట.

శాఖాహారీ

చిన్నతనం నుంచీ కామెరూన్ జంతుప్రేమికుడు. 2012 నుండి మొక్కల ఆధారిత మాంసం, చీజ్, డెయిరీ ఉత్పత్తులు తయారు చేయాలని ఓ స్టార్ట్అప్  మొదలుపెట్టాడు. కామెరూన్ భార్య సుజీ అమీస్ ఆ వ్యాపారాలన్నీ చూసుకుంటుంది. ఇక, కామెరూన్ కి  హిందూత్వం అంటే అభిమానం. అందుకే 'అవతార్' పేరును సంస్కృతం నుంచి తీసుకున్నాడు. మన పురాణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి రూపాల స్ఫూర్తితో 'అవతార్' క్యారెక్టర్లకు నీలం రంగును ఎంచుకున్నాడు.

అవతార్ -2 షూటింగ్

'అవతార్2'లో పండోరాలాంటి ప్రపంచాన్ని ఈసారి నీళ్లలో సృష్టించాడు కామెరూన్. అందుకే అధిక భాగం నీళ్లలోనే చిత్రీకరణ జరిగింది. అందుకోసం 30 లక్షల గ్యాలన్ల నీళ్లను నిల్వ చేయగల వాటర్ ట్యాంకుల్ని ప్రత్యేకంగా తయారు చేయించాడు. చిత్రీకరణకు ముందు నటీనటులకూ, టెక్నీషియన్లకూ ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ నేర్పించాడు. షూటింగ్ జరిగినన్ని రోజులూ వైద్యుల్నీ అందుబాటులో ఉంచాడు.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags