కుబేరుడు, బిజినెస్ మ్యాన్ బిల్ గేట్స్ నిద్ర గురించి చెప్పిన ఆసక్తికర
విషయాలు ఇవే
====================
కుబేరుడు, బిజినెస్ మ్యాన్ బిల్ గేట్స్ నిద్ర గురించి ఆసక్తికర
విషయాలు వెల్లడించారు. తాను మైక్రోసాఫ్ట్ ను నెలకొల్పిన తొలినాళ్లలో నిద్రపోవడం
సోమరితనంగా, అనవసరమైనదిగా భావించానని చెప్పారు.
సేథ్ రోజన్, లారెన్ మిల్లర్ తో కలిసి పాల్గొన్న ఓ
పాడ్కాస్ట్ లో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. 'నేను 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో
ఉన్నప్పుడు నిద్ర గురించి వివిధ రకాల సంభాషణలు వచ్చేవి. నేను ఆరుగంటలు
నిద్రపోయానని ఒకరు చెబితే.. లేదు నేను ఐదు గంటలే పడుకున్నానని, కొన్నిసార్లు అసలు నిద్రపోనని మరొకరు అనేవారు. వారి మాటలు
విన్న తర్వాత ఎంత గొప్ప పని చేస్తున్నారనిపించింది. నిద్ర బద్ధకం, అనవసరమని భావించి నేను కూడా నిద్రపోకుండా ఉండటానికి
ప్రయత్నించానని' బిల్ గేట్స్ వెల్లడించారు.
2020లో నిద్రపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. తన
తండ్రి అల్జీమర్స్ తో చనిపోవడమే అందుకు కారణమన్నారు. అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యత
ఇస్తున్నానని చెప్పారు. రోజూ ఎన్నిగంటలు నిద్రపోతున్నానో, ఎంత సుఖంగా నిద్రపోతున్నానో లెక్కలు వేసుకుంటున్నట్లు
వివరించారు. బయటకు కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదని, మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా
ఆయన సూచించారు. యుక్త వయసు నుంచే ఎక్కువ సేపు నిద్రపోవడం అలవర్చుకోవడం మంచిదని
అభిప్రాయపడ్డారు. న్యూరో సైంటిస్ట్ మ్యాథ్యూ వాకర్ రాసిన 'వై వుయ్ స్లీప్' పుస్తకం
ద్వారా నిద్ర గురించి తనకు ఎన్నో విషయాలు తెలిశాయని గేట్స్ వివరించారు. ప్రస్తుతం
రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు క్రమం తప్పకుండా నిద్రపోతున్నట్లు ఆయన అలవాటు
గురించి చెప్పుకొచ్చారు.
====================
====================
0 Komentar