Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2023: Nobel Peace Prize for Jailed Iranian Activist Narges Mohammadi

 

The Nobel Prize 2023: Nobel Peace Prize for Jailed Iranian Activist Narges Mohammadi

మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ‘మానవ హక్కుల కార్యకర్త’ నార్గిస్ మొహమ్మది కి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి

======================

2023 నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది ని వరించింది. ఇరాన్ లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. మానవ హక్కులు, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న నార్గిస్.. ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

సంప్రదాయం పేరుతో మహిళలకు అనేక ఆంక్షలు విధించే ఇరాన్ లాంటి దేశంలో పుట్టిన నార్గిస్.. చదువుకునే రోజుల నుంచే మహిళా హక్కులపై గళమెత్తారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పలు వార్తాపత్రికలకు కాలమిస్ట్ గా పనిచేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ (DHRC) లో 2003లో చేరి ఆ తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

13 సార్లు అరెస్ట్ ...

హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గానూ తొలిసారి అరెస్టయి ఏడాదిపాటు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత DHRC లో చేరినందుకు గానూ మరోసారి అరెసయ్యారు.

2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మరోసారి ఆమెను అరెస్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ ఆమె బెదరలేదు. రెండేళ్ల తర్వాత బెయిల్ పై బయటికొచ్చిన ఆమె.. ఇరాన్ లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రపంచంలోనే ఏటా అత్యంత ఎక్కువగా మరణశిక్షలను అమలు చేస్తున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేపట్టారు. దీంతో 2015లో మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపించారు.

జైల్లోనూ...

ఇరాన్ లో రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నార్గిస్ జైల్లోనే ఉద్యమం ప్రారంభించారు. అక్కడ కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో జైలు అధికారులు ఆమెకు కఠిన ఆంక్షలు విధించారు. ఆమె ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకుండా, కలవకుండా నిషేధం విధించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు.

2022 సెప్టెంబరులో హిజాబ్ ధరించనందుకు మాసా అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయగా కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలోనూ నార్గిస్ తన గళాన్ని వినిపించారు. అంతేకాదు.. జైల్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. అక్కడి నుంచే సంచలన నివేదికలు రాసి పలు అంతర్జాతీయ పత్రికలకు పంపించారు. అలా ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి పత్రికల్లో వచ్చాయి.

నోబెల్ ఇతర బహుమతుల మాదిరిగా కాకుండా.. శాంతి బహుమతిని నార్వే నోబెల్ కమిటీ ఓస్లోలో ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఈ పురస్కారం కోసం మొత్తం 351 నామినేషన్లు వచ్చినట్లు కమిటీ తెలిపింది. ఇందులో 259 మంది వ్యక్తులు కాగా.. 92 సంస్థల పేర్లున్నాయి.

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags