Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SUPER STAR KRISHNA BIOGRAPHY

 

SUPER STAR KRISHNA BIOGRAPHY

సూపర్ స్టార్ కృష్ణ జీవిత చరిత్ర

=====================

ఏడాదిలో ఎక్కువ సినిమాలు - రోజుకు మూడు షిప్టులు - తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్‌లను పరిచయం చేసిన 'డేరిండ్ అండ్ డాషింగ్’ హీరో

సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు.

సినిమా కి ముందు

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్ చేయాలనుకున్నారు. కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు. 

సినిమాలు

డిగ్రీ తర్వాత కూడా ఇంజినీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన 'తేనె మనసులు' సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, ఆయనను తొలగించాలని దర్శకుడి పై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది.

కుటుంబం

1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. 

ఏడాదిలో ఎక్కువ సినిమాలు - రోజుకు మూడు షిప్టులు

ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1978లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ రోజుకు మూడు షిప్టుల్లో పనిచేసేవారు.

నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్ లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ 'డేరిండ్ అండ్ డాషింగ్’ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్‌లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్ స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. 

రాజకీయాలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తెలుగుదేశం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు.

2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. 2016లో వచ్చిన 'శ్రీ శ్రీ’ కృష్ణ నటించిన చివరి చిత్రం. సినీరంగంలో విశేష సేవలందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి.

మరణం

నవంబర్ 15, 2022 మంగళవారం కాంటినెంటల్ ఆసుపత్రికి లో చికిత్స పొందుతూ వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

=====================

DOWNLOAD BIOGRAPHY PDF IN TELUGU

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags