Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tamil Nadu MP Gopinath Takes Oath in Telugu

 

Tamil Nadu MP Gopinath Takes Oath in Telugu

తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ గోపీనాథ్

======================

భారత దేశ 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి.  తమిళనాడు రాష్ట్రం లోని ‘కృష్ణగిరి’ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కె.గోపీనాథ్ తన మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. తమిళ భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంగళవారం ఆయన 18వ లోక్సభ సభ్యుడిగా అచ్చ తెలుగులో ప్రమాణం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగులో 'సభకు నమస్కారం' అంటూ ప్రారంభించి తెలుగులోనే ప్రమాణం చేశారు. చివరలో ‘నండ్రి, వణక్కం, జై తమిళనాడు’ అని ముగించారు.

తొలిసారిగా ఇప్పుడు (2024) లోక్ సభకు ఎన్నికైన ఆయన 2001 నుంచి 2016 వరకు వరుసగా మూడుసార్లు (2001, 2006 & 2011) హోసూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగానూ పనిచేశారు.

మాతృభాషను మరవొద్దు: గోపీనాథ్

'మాతృభాషను మరవొద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని కోరుతున్నా. మీరు ఎక్కడున్నా స్థానిక భాషలను గౌరవించండి. ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడి భాషను సోదరభాషగా భావించి నేర్చుకోండి. తల్లిదండ్రులుగా మనం పిల్లలతో తెలుగులో మాట్లాడితే అది తరతరాలకు కొనసాగుతూ పోతుంది. తెలుగువారు ఎక్కడ తారసపడినా తెలుగులోనే మాట్లాడాలని వినయపూర్వకంగా కోరుతున్నా. తమిళనాడులో చాలామంది తెలుగువారు మాతృభాషను ఇష్టపడతారు. కానీ మాట్లాడలేకపోతున్నారు. తాతలనాటి భాష తర్వాతి తరాలకు అబ్బటం లేదు. తప్పు మనలో ఉంది' అని ఆయన పేర్కొన్నారు.

తెలుగు వారికి ఐక్యత కావాలి: గోపీనాథ్

'తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగును కాపాడుకోవాలని యావత్ భారతదేశంలో ఉన్న తెలుగువారికి ఒక సందేశం ఇవ్వాలి. ప్రపంచంలో ఏ మూల ఉన్న తమిళ వ్యక్తికి ఇబ్బంది కలిగినా తమిళ పార్టీలు గొంతెత్తుతాయి. అది తెలుగువారిలో ఆ ఐక్యత కనిపించకపోవడం బాధాకరం. అలాకాకుండా తెలుగువారు ఎక్కడున్నా అండగా ఉంటామని ఏపీ, తెలంగాణ పాలకులు భరోసా ఇస్తే ఇతర రాష్ట్రాల పాలకులు కూడా అక్కడున్న మనవారి విషయంలో ఆలోచిస్తారు' అని గోపీనాథ్ పేర్కొన్నారు.

నా మాతృభాషను నేనుకాక ఇంకెవరు గౌరవిస్తారు?

తమిళనాడులో ఉంటున్నప్పటికీ తాను తెలుగువాడిని కాబట్టి మాతృభాషలోనే ప్రమాణ స్వీకారం చేయాలనిపించిందని ఎంపీ గోపీనాథ్ 'ఈనాడు'తో పేర్కొన్నారు. 'నా భాషను నేను గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? తమిళనాడులో తమిళ భాషాభిమానం ఉందని మన భాషాభిమానాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో తప్పు కానీ, పక్కవారికి ఇబ్బంది కానీ లేవు.

తమిళనాడు అసెంబ్లీలో జయలలిత తెలుగులోనే సమాధానం చెప్పారు: గోపీనాథ్

తమిళనాడు అసెంబ్లీలో నేను తెలుగులో మాట్లాడినప్పుడు నాటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానం ఇచ్చారు. నేను తెలుగు మాట్లాడటం వల్లే తమిళ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఉగాదిని సెలవుదినంగా ప్రకటించారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. మద్రాస్ నిజమైన తెలుగు పట్టణం. నేటికీ 40% మంది తెలుగు మాట్లాడతారు. మాకు తమిళం సోదర భాష, తెలుగు తల్లి భాష. హోసూరు ప్రాంతంలో ఇప్పటికీ తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం తెలుగులో పాఠ్యపుస్తకాలు అందిస్తోంది' అన్నారు.

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags