Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Former Prime Minister Manmohan Singh Passes Away at 92

 

Former Prime Minister Manmohan Singh Passes Away at 92

మాజీ ప్రధాన మంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (92) ఇకలేరు

====================

భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ తన 92 ఏట కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. రాత్రి 8.30 గంటల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 9.51 గంటల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. మన్మోహన్ కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు.

సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా పదేళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకూ ప్రధానిగా పని చేశారు. 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.

ప్రధాని - ఆర్థిక మంత్రి

1991లో ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందుకు ఉరికించారు.

వారం రోజులు సంతాప దినాలు

మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజులపాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది.

కీలక నిర్ణయాలు:

ప్రధానిగా మన్మోహన్ పని చేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళ్యాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags